భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
విశాఖపట్నం: సీఎం చంద్రబాబు, మంత్రులు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచిపెట్టాలని పాడేరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ప్రజాధానాన్నిలూటీ చేసి కొనుగోలు చేసిన ఆ భూములపై ప్రజలకే సర్వహక్కులు ఉండాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు గిరిజనుల నిధులను కొల్లగొట్టి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
ఆ నిధులతోనే రాజధాని ప్రాంతంలో విస్తారంగా భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. రాజధానికి భూసమీకరణ పేరుతో పేద రైతుల భూములను ప్రభుత్వం గుంజుకుందని ఎమ్మెల్యే ఈశ్వరి దుయ్యబట్టారు. కానీ సీఎం, మంత్రుల భూములకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. రాజధాని భూముల కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ నిర్వహించాలని, సీఎం, మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.