సాక్షి, తాడేపల్లి: ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయడానికి అచ్చెన్నాయుడు ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు రూ.150 కోట్ల అవినీతికి పాల్పడినట్లు అధికారులు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఆయనను కిడ్నాప్ చేశారంటూ తప్పుడు లేఖలు రాయడం విడ్డూరంగా ఉంది అన్నారు. అచ్చెన్నాయుడు పాల్పడిన స్కామ్‌కు ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో కార్మికుల సొమ్ము నిలువ దోపిడీ చేసి.. వారి పొట్ట కొట్టిన ఘనుడు అచ్చెన్నాయుడు అని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు వెనుక ఉన్నవాళ్లనందరిని అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు. ఈ పాపంలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందని రమేష్ ఆరోపించారు.
రమేష్ మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు తప్పు చేస్తే బీసీలు నిరసనలు తెలపాలా అని ప్రశ్నించారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్లు బతికి ఉంటే చంద్రబాబుకు చీవాట్లు పెట్టేవారని అన్నారు. బీసీ నేత అయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు బంట్రోతుగా మార్చారని ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఉన్నారని.. వారి పాత్రపైన విచారణ జరపాలని కోరారు. అచ్చెన్నాయుడు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తే.. బీసీలు ధర్నా చేయాలా.. వారు మీకు అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నారా చంద్రబాబు అని రమేష్ ప్రశ్నించారు. (అచ్చెన్నాయుడు అరెస్టు; చింతమనేని హైడ్రామా)
బడుగుబలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, మంత్రి వర్గంలో 60 శాతం పదవులు కేటాయించారని తెలిపారు. అచ్చెన్నాయుడు బీసీల్లో ఎందుకు పుట్టారని బీసీలు భాదపడుతున్నారన్నారు. అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. పేదల పొట్ట కొట్టిన పాపం ఊరికే పోదన్నారు. హైదరాబాద్ నుంచి లోకేష్ వచ్చి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి పెద్దపీట వేశారని తెలిపారు. బలహీన వర్గాల్లో పుడితే ప్రజా ధనం దోచేస్తారా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఊచలు లెక్కపెడతారని రమేష్ హెచ్చరించారు. (‘రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు’)
Comments
Please login to add a commentAdd a comment