
మానవత్వం చాటిన రోజా
గాయపడ్డ మహిళను ఆస్పత్రిలో చేర్పించిన నగరి ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను కాపాడి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం చిత్తూరులో జరిగే జెడ్పీ సమావేశానికి బయల్దేరిన రోజాకు నేండ్రగుంట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సింధు అనే మహిళ కనబడింది.
స్కూటీపై వెళ్తున్న ఆమె ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బండి అదుపు తప్పడంతో రోడ్డుపై పడింది. తల రోడ్డుకు బలంగా కొట్టుకొని ర క్తస్రావమైంది. ఈ సంఘటనను చూసిన రోజా డ్రైవర్‌ను అప్రమత్తం చేసి సింధును తన కారులో ఎక్కించుకుని దగ్గర్లో ఉన్న పూతలపట్టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం వైద్యులు ఆమెను అంబులెన్సులో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఆమె కోలుకుంటోంది.