ప్రజాకోర్టులో నిలదీస్తే తప్పా?
ప్రజాకోర్టులో చంద్రబాబు మోసాల్ని ప్రశ్నించిన తమ అధినేతపై అధికారపార్టీ నేతలు విరుచుకుపడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మె ల్యే ఆర్కే రోజా విమర్శించారు.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా
సాక్షి, హైదరాబాద్: ప్రజాకోర్టులో చంద్రబాబు మోసాల్ని ప్రశ్నించిన తమ అధినేతపై అధికారపార్టీ నేతలు విరుచుకుపడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మె ల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఏమాత్రం నైతిక విలువల్లేని టీడీపీ నేతలకు వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కే లేదన్నారు. తండ్రిని చంపిన ఔరంగజేబు, గాంధీని చంపిన గాడ్సేలకంటే నీచమైన వ్యక్తి చంద్రబాబు అని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆరే స్వయంగా చెప్పాక.. ఇక ఎవరెన్ని చెప్పినా తక్కువేనన్నారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపట్ల ప్రతిస్పందించారు. 600 హామీలిచ్చి ప్రజలందర్నీ మోసం చేసిన బాబులాంటి వ్యక్తిని... నంద్యాల ఓటర్లు న్యాయమూర్తి స్థానంలో కూర్చొని, ఉరితీయాలని తీర్పు చెప్పినా తప్పులేదని ప్రతిపక్షనేత అనడంలో ఏం తప్పుందని ప్రశ్నించారు. తప్పు చేసినవారికి కోర్టులో న్యాయమూర్తి శిక్షవేస్తే... ప్రజాకోర్టులో ప్రజలే తీర్పిస్తారిని అన్నారు.
కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్
సీఎం చంద్రబాబు కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ అని, గుంటనక్క, ఊసరవెల్లి అనేందుకు బాబుకే పేటెంట్ రైట్స్ ఉన్నాయని, రాష్ట్రంలో చిన్న పిల్లాడినడిగినా చెబుతారని రోజా అన్నారు. గతంలో తొమ్మిదేళ్ల పాలనలో బాబు రాయలసీమను ఏవిధంగా మోసగించారో.. మళ్లీ ఇప్పుడెలా సర్వనాశనం చేస్తున్నారో వివరించారు. తాము అధికారంలోకొస్తే ప్రజాభీష్టం మేరకు కేసీకెనాల్‌కు తుంగభద్ర నుంచి సరిపడా నీరందేలా స్థిరీకరణ చేపడతామని జగన్ హామీ ఇచ్చారని, కానీ బాబు ఇది అవసరమా? అని అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. రోజా చనిపోయిందంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో శ్రద్ధాంజలి పెడుతున్నారని.. వీళ్లసలు మనుషులేనా? అన్నారు. ఉన్మాదికి ప్యాంటు, షర్టు వేస్తే చంద్రబాబన్నారు. ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నంద్యాల ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.