సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా తాను ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కేవలం సంక్షేమంపై దృష్టిపెట్టి.. అభివృద్ధిని మరిచారు అనే ప్రతిపక్షాల మాటలు అర్థం లేనివని కొట్టిపారేశారు. సంక్షేమంలోనే అభివృద్ధి కూడా ఉందన్న వాస్తవాన్ని వారు గుర్తించాలని హితవు పలికారు. (ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్)
గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేసేవని.. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని సీఎం వైఎస్ జగన్ సూటిగా, స్పీడుగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని డొక్కా కొనియాడారు. కాగా క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు కలిసిన వారిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహా ఇతర నాయకులు కూడా ఉన్నారు. ఇక ఇటీవల శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ తరఫున మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామిషన్ దాఖలు చేయగా.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన విషయం విదితమే. దీంతో శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సభ్యుల సంఖ్య 10కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment