
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడుతున్న భాష ఆయన వయసుకు, అనుభవానికి తగ్గట్టు లేదని.. ఇకనైనా సంస్కారవంతంగా మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, శాసనమండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వాడుతున్న పదజాలం ఆయన స్థాయికి తగ్గట్టు లేదన్నారు. భారీ ఓటమితో బాబు వైఖరి బాగా దిగజారిందన్నారు. తనను గెలిపించకపోవడం ప్రజల తప్పు అని, పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని చంద్రబాబు అనడం ఆయన వైఖరికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ఆయన పాలిస్తే ప్రజలు ఎందుకు మర్చిపోతారని ప్రశ్నించారు. ప్రజలు వివేకవంతులని.. పాలిచ్చే ఆవు ఏదో తన్నే దున్నపోతు ఏదో వారికి తెలుసన్నారు. పరిపాలనలో సరికొత్త సంస్కరణలు తీసుకొస్తానని వైఎస్ జగన్ చెప్పారని, ఆయనపై నమ్మకంతోనే పాలిచ్చే ఆవుగా భావించి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు.
ఆయన చీకటి చంద్రుడు
40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును విడదీసి మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు గురించి చాలామంది చాలా అన్నారని, చంద్రబాబు వెన్నెల లేని చంద్రుడని గతంలో ఎంతోమంది కామెంట్ చేశారని గుర్తు చేశారు. బాబు చీకటి చంద్రుడే తప్ప ఆయన మొహంలో వెలుగు కనబడదని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో అక్రమాలు, అన్యాయాలు సహించరని.. వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మొండితనంతోనే ఉంటారన్నారు. ఇన్ని లక్షలమందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెబితే అది ఏ పరిస్థితుల్లోనైనా జరిగి తీరాల్సిందే అనే తత్వంతో వైఎస్ జగన్ ఉంటారన్నారు. దానిని మొండితనం అనరని, వివేకంతో కూడిన దృఢసంకల్పం అంటారని చెప్పారు.
ప్లాన్డ్‌గా ట్రాప్ చేయాలని...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కరకట్ట లోపల అక్రమ కట్టడాలు నిర్మించిన వారందరికీ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజావేదికను చంద్రబాబుకు ఇస్తే ఆ భవనం సక్రమమైనదేనని సీఎం వైఎస్ జగన్ ఒప్పుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో ప్లాన్డ్‌గా ట్రాప్ చేసి మరీ దానిని తనకు కేటాయించాలని కోరారన్నారు. అది అక్రమ కట్టడం కాబట్టే వైఎస్ జగన్ తొలగించి.. ఆ సామగ్రి భద్రపరిచి మరో ప్రాంతంలో దానిని కట్టబోతున్నారని తెలిపారు. హుందాగా వ్యవహరించే సీఎం వైఎస్ జగన్ విషయంలో చంద్రబాబు మరోసారి ఇటువంటి పదజాలం వాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.