
చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
►పూర్తి స్థాయిలో అమలుకు రైతులు, డ్వాక్రా మహిళల డిమాండ్
►చంద్రబాబు నిర్ణయాలకు నిరసనగా దిష్టిబొమ్మల దహనం
►ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసుల ఓవరాక్షన్
►తెనాలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రుణమాఫీపై రాష్ట్ర ఫ్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ‘నరకాసుర వధ’ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఎన్నికల సమయంలో రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీలను పూర్తిగా అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బాబు వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నినదించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
‘నరకాసుర వధ’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన ఈ ఆందోళనలు నిలిపివేసేందుకు అటు పోలీసులు, ఇటు టీడీపీ కార్యకర్తలు విఫలయత్నాలు చేశారు.
చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. ప్రతిపక్ష పార్టీ గొంతునొక్కే ప్రయత్నాలను అటు పోలీసులు, ఇటు అధికార పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో చేపట్టారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామ కృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు తమ నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, ఆయన హామీలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాన్ని నిలువరించేందుకు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి మద్దతుగా నిలిచి ఆందోళనను విఫలం చేసేందుకు తమ వంతు సహకారం అందించారు.
రేపల్లె నియోజకవర్గంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి, తాడికొండ నియోజకవర్గంలో క్రిస్టినాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించగా, మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ నాయకుడు చాంద్‌బాషా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది.