పునర్విభజన చట్టం అమలుపై చర్చకు నోటీసు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి గురువారం ఉదయం రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. పునర్విభజన చట్టం అమలు తీరుపై ఇవాళ మధ్యాహ్నం రెండుగంటలకు రాజ్యసభలో కూలంకషంగా చర్చ జరగనుంది. కాగా గత రెండురోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వివాదం ముదరడంతో సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిన్న రాజ్యసభలో వివిధ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
వాస్తవానికి మంగళవారం రాజ్యసభలో జరిగిన వాగ్వివాదాల్లో జోక్యం చేసుకొంటూ విభజన చట్టం అమలుపై చర్చ జరగాలని, దీనిపై కేంద్ర ఆలోచన తెలియాల్సి ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి పేర్కొన్న విషయం తెలిసిందే. విభజన చట్టం అమలుపై ఇవాళ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌కు అవకాశం ఉండేలా నోటీసులు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.