ఇంకా వెనుకబడే ఉన్నాం...
♦ జిల్లాలో గిరిజన యూనివర్శిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి
♦తోటపల్లి ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల సమస్య తీర్చాలి
♦వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీలో బెల్లాన చంద్రశేఖర్ విజ్ఞప్తి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ఇంకా మా జిల్లా వెనుకబడే ఉంది. 1979లో జిల్లా ఏర్పాటు అయినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సమస్యలన్నీ తీర్చాలి’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న పార్టీ జాతీయ ప్లీనరీ వేదికపై జిల్లాకు సంబంధించి పలు అంశాలను శనివారం ఆయన ప్రస్తావించారు. జిల్లాలో 9 నియోజకవర్గాలకు సంబంధించి ఆరు అంశాలపై తీర్మానం చేశారు. జిల్లా ప్లీనరీలో చేసి న తీర్మానాలను జాతీయ ప్లీనరీలో ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి తొలుత ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజన వర్శిటీకి తొలి ప్రాధాన్యం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని బెల్లాన కోరారు. జిల్లా ప్రధాన కేంద్రమైన విజయనగరం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంత వరకూ లేదనీ... 2004–2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వర్షాధారం మీద, చెరువుల మీద ఆధారపడ్డ రైతాంగానికి తోటపల్లి కాలువ, రామతీర్థసాగర్‌లకు నిధులు కేటాయించారని తోటపల్లి పనులు 90శాతం పూర్తి చేశారని కానీ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లయినా మిగతా 10 శాతం పనులూ పూర్తికాలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీటి సమస్య లేకుండా చేయాలని కోరారు. జిల్లాలో 8 మండలాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని, వారికి వైద్యం అందుబాటులో లేదన్నారు. వీరికి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా వైద్య కళాశాలను జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు.
హోదాతోనే భవిత
ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉందనీ... ప్రత్యేక హోదా వల్ల విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని, మూతపడిన పరిశ్రమలు తెరిపించే అవకాశం ఉంటుందని ప్లీనరీ దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు పరుస్తామనే హామీని అమలులోకి తీసుకు రావాలని కోరారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జిల్లాకు రావాల్సిన నిధులు తీసుకురావాలని తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పీడికరాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, సీనియర్ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్లీనరీలో పాల్గొన్నారు.