సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన దీక్షను విరమించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్: సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన దీక్షను విరమించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ విజ్ఞప్తి చేసింది. దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఆరోగ్యం క్షీణిస్తున్న రీత్యా రాష్ట్రం నలుమూలల నుంచీ అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నందున దీక్ష విరమించాలని కోరుతూ విజయమ్మ ద్వారా జగన్‌కు విజ్ఞప్తి చేయించాలని నేతలు తీర్మానించారు. అయితే జగన్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
ప్రజల్లో ఆందోళన: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వల్ల శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రజలు ఆందోళనతో ఉన్నారని మాజీ మంత్రి, పార్టీ నేత తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జగన్‌ను పరామర్శించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన ఆయన్ను పోలీసులు అనుమతించకపోవడంతో నిరసన తెలిపారు. ‘‘ఆసుపత్రి వద్ద పోలీసుల మోహరింపు దేనికి? చుట్టూ ముళ్ల కంచె వేయడమేంటి? ఇది ప్రజాస్వామ్యమా.. లేక ఎమర్జెన్సీ విధించారా?’’ అని ప్రశ్నించారు.