
'టీడీపీ కుట్రపై న్యాయ విచారణ'
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ విజ్ఞప్తి చేశారు. నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ నేత కాల్పులకు దిగడంపై ఆయన స్పందించారు. ఈ నెల 31 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ చాలా మంది ఆయుధాలు పోలీసులకు అప్పగించలేదని తెలిపారు.
కర్నూలు జిల్లాలో మొత్తం 2,252 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయని, ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో 1,211 మంది మాత్రమే స్థానిక పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేశారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. ఆయుధాలు డిపాజిట్ చేయకుండా టీడీపీ పథక రచన చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీ కుట్రపై న్యాయ విచారణ జరిపించాలని శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 28న నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.