
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
అనంతపురం సప్తగిరి సర్కిల్: అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని , అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం అనంతపురం పార్లమెంటు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అనంతపురం పార్లమెంటు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ కొర్రపాడు హుస్సేన్‌పీరా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రభుత్వంతో అమీతుమీ తెల్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ వారికి అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణాల్లో అగ్రిగోల్డ్ స్కాం ఒకటని తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను కొనసాగించిందన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ పేద, మధ్య తరగతికి చెందిన లబ్ధిదారులతో రూ. 6,780 కోట్ల డిపాజిట్లను సేకరించారన్నారు.
సేకరించిన సొమ్ముకు డిపాజిట్ల గడువు పూర్తయ్యే సమయానికి వాటిని చెల్లించకుండా మోసం చేశారన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు అప్పులకంటే విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. విలువైన ఆస్తుల్లో ప్రధానంగా 16 వేల ఎకరాల భూమి, హాయ్‌ల్యాండ్ ఉన్నాయన్నారు. ఆయా ఆస్తులను కారుచౌకగా కాజేయాలని టీడీపీకి చెందిన పెద్దలు కుట్ర పన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాధితుల వివరాల సేకరణకు కార్యచరణను రూపొందించామన్నారు. జాబితాను సిద్ధం చేసేందుకు ప్రత్యేక దరఖాస్తును రూపొందించామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను సేకరిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని అగ్రిగోల్డ్ బాధితుల వివరాల సేకరణకు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. దీన్ని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి, శివకేశవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాఘవేంద్ర, మోహన్‌రెడ్డి, సిలార్‌సాహెబ్, రాజేంద్రప్రసాద్, అల్లాబకష్, తిప్పేస్వామి, వెంకటరామిరెడ్డి, కృష్ణమోహన్, కవిత, షంషాద్‌బేగం తదితరులు పాల్గొన్నారు.