
సమైక్య తీర్మానం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 రాష్ట్రానికి చేరిన నేపథ్యంలో శుక్రవారం శాసనసభలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సభలో సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ సభా నియమావళిలోని 77వ నిబంధన కింద స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నోటీసిచ్చింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విభజన బిల్లు అసెంబ్లీకి రాకముందే సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ వైఎస్సార్‌సీపీ తొలినుంచీ డిమాండ్ చేస్తుండటం, మిగతా పార్టీలు పట్టించుకోకపోవడం తెలిసిందే. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు రోజు స్పీకర్ సమక్షంలో జరిగిన సభా వ్యవహారాల మండలి సమావేశంలో కూడా పార్టీ ఇదే ప్రతిపాదన చేసినా అందులో పాల్గొన్న కాంగ్రెస్, టీడీపీతో సహా ఏ పార్టీలూ స్పందించకపోవడం, దాంతో వైఎస్సార్‌సీపీ వాకౌట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమైక్యం కోసం వైఎస్సార్‌సీపీ స్వయంగా రంగంలోకి దిగింది.
పార్టీ నేతలు గురువారం నేరుగా స్పీకర్‌ను కలిసి, సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం కోరుతూ శాసనసభ నియమావళి 77వ నిబంధన ప్రకారం సభాపతికి నోటీసులు అందజేశారు. అంతే...! ఇప్పటిదాకా సమైక్య తీర్మానం అంశంపై ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనం పాటించిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రతినిధులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నపళాన వెళ్లి స్పీకర్‌ను కలిసి సమైక్య తీర్మానం చేయాలంటూ హడావుడిగా వారు కూడా మరో నోటీసిచ్చారు. తద్వారా... విభజన బిల్లు సభకు చేరముందే సమైక్య తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌సీపీ బాటలోకి వారు కూడా వచ్చినట్టయింది. వైఎస్సార్‌సీపీ నోటీసు శుక్రవారం సభలో కీలకాంశంగా మారే అవకాశం కన్పిస్తోంది. తామిచ్చిన నోటీసుపై శుక్రవారం సభలో చర్చకు అనుమతి కోసం పట్టుబట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. విభజన బిల్లు ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీకి చేరిన నేపథ్యంలో సమైక్యం కోసం ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం ప్రతిపాదించాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది.
కాంగ్రెస్ నేతల హడావుడి మంతనాలు
విభజన బిల్లు రాకముందే సభలో సమైక్య తీర్మానానికి ప్రతిపాదించడం మంచిదని వైఎస్సార్‌సీపీ తొలి నుంచీ ఎంతగా మొత్తుకున్నా సీఎం కిరణ్‌తో సహ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలెవరూ ఇంతకాలం స్పందించపోవడం తెలిసిందే. తీరా బిల్లు రాష్ట్రానికి వచ్చి, సభలో సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ గురువారం స్పీకర్‌కు నోటీసివ్వడంతో వారిలో కొందరికి చురుకు పుట్టింది.
సమైక్య తీర్మానమంటూ వారు కూడా కొత్త పల్లవి అందుకున్నారు. అందుకోసం నోటీసులు అందించడంపై గురువారం ఉదయం నుంచి పలుదఫాలుగా చర్చలు జరిపారు. సమైక్యాంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ఉగ్రనరసింహారెడ్డి తదితరులు సీఎల్పీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. అసెంబ్లీ నియమావళిలోని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ 77, 78 నిబంధనల కింద స్పీకర్‌కు నోటీసివ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్నం తిరిగి సీఎల్పీ కార్యాలయంలోనే గాదె, ైశె లజానాథ్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మురళీకృష్ణ, విష్ణు, కారుమూరి నాగేశ్వరరావు, కమలమ్మ, జయమణి సమావేశమయ్యారు. నోటీసుపై అప్పటికే కొందరితో సంతకాలు చేయించారు. గాదె, ధర్మాన ప్రసాదరావు, జేసీ, కాటసాని, కారుమూరి, ఉగ్ర, జుట్టు జగన్నాయకులు, రౌతు సూర్యప్రకాశ్‌రావు, బి.ఎన్.విజయకుమార్, మురళీకృష్ణ, పి.ఎం.కమలమ్మ, జయమణి నోటీసుపై సంతకం చేశారు. దాన్ని స్పీకర్‌కు అందించారు. తమ నోటీసుపై నిబంధనల ప్రకారమే నడచుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారని అనంతరం మీడియాకు తెలిపారు. రాజ్యాంగాన్ని, సంప్రదాయాలను, ప్రజాస్వామ్య నిబంధనలను గాలికొదిలి అప్రజాస్వామిక రీతిలో రాష్ట్రాన్ని విభజించడం సరికాదన్నారు.
ముందే మేల్కొనాల్సింది!
రాష్ట్ర సమైక్యత విషయంలో గతంలోనే తీర్మానం చేసి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. సభలో వైఎస్సార్‌సీపీ బలంగా సమైక్యవాదం విన్పించనుందని స్పష్టం కావడంతో, తామూ సమైక్యతనే కోరుతున్నామని చెప్పుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎత్తుగడ వేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలినుంచీ వైఎస్సార్‌సీపీ ఎంతగా మొత్తుకుంటున్నా సభలో సమైక్య తీర్మానం డిమాండ్‌కు కాంగ్రెస్ నుంచి కనీస మద్దతు కూడా లభించని విషయాన్ని పీసీసీ నేతలు కొందరు గుర్తు చేస్తున్నారు. తీరా ఇప్పుడు ఆ పార్టీనే అనుసరిస్తూ సమైక్య నోటీసివ్వడం వెనక ఉద్దేశమేమిటో అందరికీ అర్థమవుతూనే ఉందని వారంటున్నారు.