వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రెండో రోజైన మంగళవారం జిల్లావ్యాప్తంగా
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రెండో రోజైన మంగళవారం జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చాయి. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, జిల్లా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయాలని పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఆయా మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసిల్దార్లకు సమర్పించిన వినతిపత్రాల్లో కోరారు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో తహసిల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ధర్నాలు నిర్వహించారు.
అనంతరం తహసిల్దార్లకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. ఏలూరు మండల కార్యాలయం వద్ద పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి తదితరులు ధర్నా నిర్వహించి తహసిల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. పెదపాడు మండలంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని గణపవరం, నిడమర్రు మండలాల్లో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందచేశారు.
కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు మండలంలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనా కార్యక్రమంలో రైతు విభాగం కార్యదర్శి నడపన సత్యనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ చెల్లెం ఆనంద్‌ప్రకాష్ తదితరులు పాల్గొని తహసిల్దార్‌కు వినతిపత్రం అందచేశారు.
గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల, గోపాలపురం మండలాల్లో నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. టి.నరసాపురంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం, చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం, కామవరపుకోట మండలాలు, ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ మండలం, భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి తహసిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.