సింగరేణి ప్రధాన కార్యాలయం
సింగరేణిలో కార్మిక నాయకుల వ్యవహారశైలి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. మస్టర్లు పడి విధులకు వెళ్లడం లేదు. యాజమాన్యమూ పట్టించుకోవడం లేదు. దీంతో సాధారణ కార్మికులపై పనిభారం, కంపెనీపై ఆర్థికభారం పెరుగుతోంది. సాధారణ కార్మికుడిపై అగ్గి మీద గుగ్గిలమయ్యే అధికారులు.. జల్సా చేస్తున్న నాయకుల విషయానికొచ్చే సరికి చేష్టలుడిగి చూస్తున్నారు.
రామకృష్ణాపూర్(మంచిర్యాల జిల్లా) : సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం, ప్రాతినిధ్య సంఘం(గత ఎన్నికల్లో గెలిచిన) నాయకుల హవాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. బడా నేతలే కాదు చోటా మోటా నాయకులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, గనుల మీద మస్టర్లు పడి, విధులకు వెళ్లకుండా బయటే పచార్లు కొడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కమిటీల పేరిట ఇష్టారాజ్యం
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన యూనియన్‌కు వివిధ కమిటీల్లో ప్రాధాన్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ గనికి పిట్ కమిటీ, క్రీడలు, ఆలయాలు, క్యాంటీన్‌లు, రక్షణ... ఇలా పలు రకాల కమిటీలను నియమిస్తారు. ఒక గనిని తీసుకుంటే కనీసం 10 మంది వరకు గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు ఉంటారు. వీరిలో చాలా మంది మస్టర్లు పడడమే తప్ప విధులు నిర్వర్తించిన పాపాన పోవడం లేదు. కొన్ని సంవత్సరాల తరబడి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కార్యక్రమాలు మరింతగా పెరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం విజయవంతం చేసేందుకు సంస్థ సైతం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడంతో నాయకులు మరింతగా రెచ్చిపోయారు. అవకాశం చిక్కిందంటే చాలు మూకుమ్మడిగా మస్టర్లు పడి కార్యక్రమాల్లో సొంత పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇటీవల మందమర్రి ఏరియా పరిధిలోని ఓ జాతర ఏర్పాట్లకు సంబంధించి జీఎం పర్యటించిన సమయంలో ఏకంగా 20 మందికి పైగా యూనియన్ నాయకులు తరలిరావడం ఒకింత చర్చకు దారితీసింది. వీరంతా వారివారి డిపార్టుమెంట్లలో మస్టర్ పడి రావడం గమనార్హం.
సంస్థకు రూ.కోట్లలో టోపీ
నాయకుల వ్యవహార శైలి సింగరేణి సంస్థపై పెనుభారం మోపుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో కార్మికునికి మస్టర్‌కు కనీసం 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల నుంచి కనీసం 10 చొప్పున తీసుకున్న మొత్తం 470 మంది వరకు నాయకులు ఉంటారని తెలుస్తోంది. 29 భూగర్భ గనుల్లో 290 మంది, 18 ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో 180 మంది మస్టర్లు పడే వారుంటారు. వారు విధులు నిర్వర్తించకున్న వేతనం చెల్లించాల్సిన పరిస్థితి.
1500 రూపాయల చొప్పున నెలకు 25 మస్టర్లకు గణించిన 470 మందికి కోటి 76 లక్షల 25 వేల రూపాయలు అవుతుంది. నెలకు కనిష్టంగా 20 మస్టర్ల చొప్పున తీసుకుంటే 1500 రూపాయల చొప్పున రూ. కోటి 41 లక్షల వ్యయం చేయాల్సి వస్తోంది. కనీసం ఏ పని ముట్టు ముట్టకుండా, చేతికి మట్టి అంటకుండానే గుర్తింపు కార్మిక సంఘం నాయకులకు వేతనాల రూపంలో ఇలా ముట్టజెపాల్సి వస్తోంది. ఈ లెక్కన సంవత్సరానికి ఎంతమేరకు అనవసరపు దుబారా సంస్థపై పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాలో ఉన్నా.. మస్టర్!
విధుల అనంతరం ఔట్ టైం పడితేనే కార్మికుడి మస్టర్ లెక్కలోకి తీసుకుంటారు. కానీ జనరల్ షిఫ్టుల పేరిట మస్టర్లు పడుతూ బయట తిరిగే నాయకులకు ఇవేవి వర్తించవు. తతంగమంతా తెలిసినా సంబంధిత విభాగం సిబ్బంది అంతా చూసుకుంటారు. అవసరమైతే అమెరికాలో ఉన్నా స్థానికంగా మాత్రం విధుల్లో ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తాయి. ఇదంతా షరామామూలే అన్నట్లు ఉంటుంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. తాము అత్యవసర పని మీద కూడా బయటకు వెళ్లలేకపోతున్నామని, అదే నాయకులైతే, మస్టర్ పడి జల్సా చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment