
సాక్షి,న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్ల జాబ్ రోల్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భిన్న రంగాల్లో దూసుకొచ్చిన నూతన టెక్నాలజీల కారణంగా సంప్రదాయ కొలువుల స్ధానంలో కొత్త రోల్స్ ముందుకొచ్చాయి. బిగ్ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, మొబైల్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి నూతన విభాగాల్లో తాజా టాలెంట్‌ను కొలువుతీర్చేందుకు కంపెనీలు క్యాంపస్‌ల బాట పడుతున్నాయి.
గతంలో ఈ విభాగాల్లో వివిధ పొజిషన్స్‌లో ప్రైమరీ, మిడ్‌లెవెల్ ప్రొఫెషనల్స్‌కు ఆఫర్ చేసేవారు. అయితే ఎంట్రీ లెవెల్‌లోనే గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకుని ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఈ నైపుణ్యాల్లో దేశవ్యాప్తంగా 12,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రొవెడర్ సింప్లీలెర్న్ పేర్కొంది. ఇక డిజిటల్ మార్కెటింగ్‌లో 12,480 మంది ఫ్రెషర్స్‌కు, మొబైల్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో 11,700 మంది ఫ్రెషర్స్‌కు అవకాశాలున్నాయని వెల్లడించింది.
గతంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు జరిగే క్లౌడ్ కంప్యూటింగ్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఐటీ సేవల ఉద్యోగాల కన్నా ఈ సంఖ్య దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఐటీ సేవలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగం నుంచి ఈ ఉద్యోగాలు సమకూరనున్నాయని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కాశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కస్టమర్లకు సేవలు అందించే క్రమంలో ఈ టెక్నాలజీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్ని కంపెనీలు గుర్తించడంతో ఆయా జాబ్ రోల్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇతర జాబ్‌లకు ఇచ్చే ప్రారంభ వేతనమే వీటికి ఉన్నప్పటికీ రెండు మూడేళ్లలో ఈ జాబ్‌రోల్స్‌లో కుదురుకునే అభ్యర్థులకు వేతన ప్యాకేజ్ భారీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.