
నీరవ్ మోదీ
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో ఆయన నివాసముంటున్న రిజిస్ట్రర్ ప్లాట్‌కి నీరవ్ మోదీ గత కొంత కాలంగా రాలేదని తెలిసింది. ముంబైలోని పెడరూట్ క్రాస్‌విన్నర్ హౌజ్‌లోని నాలుగో నెంబర్ ప్లాట్‌లో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముండేవారు. కానీ గత రెండు నెలలుగా ఆయన అక్కడికి రాలేదని తెలిసింది. అంతేకాక పీఎన్‌బీలో ఇంత భారీ మొత్తంలో స్కాం చేసినప్పటికీ, నీరవ్ మోదీ ఇంట్లో మాత్రం ఎలాంటి తనిఖీలు జరుగలేదు. ఇప్పటి వరకు ఆయన ప్లాట్‌కు పోలీసులు కానీ, బ్యాంకు అధికారులు కానీ, సీబీఐ అధికారులు ఎవరూ రాలేదని నీరవ్ మోదీ సర్వెంట్ చెప్పాడు. ప్రస్తుతం మోదీ ఆఫీసులు, దుకాణాలు, వర్క్‌షాపుల్లోనే అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీ, సూరత్, ఢిల్లీలలో 13 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటి వరకు నీరవ్ మోదీ ఇంట్లో తనిఖీలు చేయకపోవడం చర్చనీయాంశమైంది.
అంతేకాక బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా లాగానే, ప్రస్తుతం నీరవ్ మోదీ కూడా వ్యవహరించారు. పీఎన్‌బీ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయకముందే నీరవ్ మోదీ విదేశాలకు చెక్కేశారు. పీఎన్‌బీకి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో కొన్ని రోజుల కిందటే ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుని వదిలిపెట్టింది. అనంతరం పీఎన్‌బీ ఈ భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. నీరవ్ మోదీ విదేశాలకు పారిపోవడంపై అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టుచ్చినట్టు కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాల్యా కంటే అధికంగా నీరవ్ మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు రూ.11వేల కోట్ల మోసపూరిత లావాదేవీలు చేపట్టినట్టు పీఎన్‌బీ తేల్చింది. ఈ నగదును విదేశాలకు పంపినట్టు కూడా తెలుస్తోంది. ఈ కేసుపై సీబీఐ, ఈడీ రెండూ దర్యాప్తును ముమ్మరం చేశాయి. పీఎన్‌బీ మాత్రమే కాక, మొత్తం 30 బ్యాంకులు ఈ కుంభకోణ భారీన పడినట్టు తెలుస్తోంది. మరోవైపు నీరవ్ మోదీ జువెల్లరీస్‌కు బ్రాండు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆయన కంపెనీకి నోటీసులు పంపింది. తనకు ప్రకటన డబ్బులు చెల్లించలేదని ఆ నోటీసుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment