15 శాతానికి తగ్గిన వేకెన్సీ: జేఎల్‌ఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2013లో దేశంలోని ప్రధాన నగరాల్లో 18.5 శాతంగా ఉన్న గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఖాళీలు... 2016 నాటికి 15 శాతానికి తగ్గినట్లు జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పమని పేర్కొంది. తయారీ రంగం, లాజిస్టిక్, ఎఫ్‌ఎంసీజీ, ఈ–కామర్స్, స్టార్టప్స్ వంటి కంపెనీలలో వృద్ధే ఇందుకు కారణమని జేఎల్‌ఎల్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. అయితే వచ్చే ఏడాది కాలంలో స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్స్) వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి వాటితో ఈ విభాగానికి పెను సవాళ్లు ఎదురుకానున్నాయని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకించి ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై నగరాల్లోని ఆఫీస్ స్పేస్ మార్కెట్ దెబ్బతింటుందన్నారు. అయితే గ్రేడ్–బీ ఆఫీస్ స్పేస్ సరఫరా తగ్గడంతో ఈ విభాగంలో అద్దెలు పెరిగిపోయాయని తెలిపారు. పుణె, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో మౌలిక రంగంలో భారీగా వస్తున్న పెట్టుబడులతో ఆయా నగరాల్లో 2017లో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌కు రీట్స్ పెట్టుబడులు మంచి అవకాశంగా మారతాయని చెప్పారు.