సాక్షి, బిజినెస్ విభాగం
2జీ స్కామ్‌కు సాక్ష్యాలు లేవని రాజా, కనిమొళి తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది ప్రత్యేక కోర్టు. ఇదే వ్యవహారానికి సంధించి గతంలో సుప్రీంకోర్టు 122 లైసెన్సులను రద్దు చేసింది. ఆయా సర్కిళ్లలో కార్యకలాపాలు సాగిస్తున్న పలువురు టెలికామ్ ఆపరేటర్లు లైసెన్సులు కోల్పోయారు. కొందరైతే ఆ దెబ్బకు మూటాముల్లే సర్దుకుని వెళ్లిపోయారు కూడా!! ఇంకొందరు కొనసాగినా మనుగడ సాగించలేకపోయారు. అసలు ఎవరెవరికి లైసెన్సులు దక్కాయి? ఎవరెంత నష్టపోయారు? ఆ వివరాలేంటో చూద్దాం...
2008 నాటికి దేశంలో టెలికామ్ ఆపరేటర్ల సంఖ్య 18. ఇపుడేమో 11. తాజా విలీనాలు, కొనుగోళ్ల తరవాత చివరికి మిగిలినవి భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయెన్స్ జియో, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ మాత్రమే. 2008లో అప్పటి కేంద్ర టెలికం మంత్రి కొత్త 2జీ లైసెన్స్‌లకు బిడ్లను ఆహ్వానించారు. ‘మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు’ ప్రాతిపదికన 122 లైసెన్సులు జారీ చేస్తామంటూ ఈ బిడ్లు పిలిచారు. అయితే ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులో పలు నియమాలు ఉల్లంఘించారని, కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా లంచాలిచ్చాయనే ఆరోపణలొచ్చాయి.
లైసెన్స్ పొందిన టెలికం సంస్థలివే..
యూనిటెక్ వైర్‌లెస్: 22 లైసెన్స్‌లు
దేశీ రియల్టీ దిగ్గజం యూనిటెక్ లిమిటెడ్ 22 లైసెన్స్‌లు పొందింది. దీంతో నార్వేకు చెందిన టెలినార్... ఈ సంస్థలో 67.5 శాతం వాటా కొనుగోలు చేసి ఇండియాలోకి రంగప్రవేశం చేసింది. మొత్తంగా టెలినార్ గ్రూప్ రూ.6,100 కోట్లు ఈక్విటీ, రూ.8 వేల కోట్లు కార్పొరేట్ గ్యారంటీల రూపంలో పెట్టుబడి పెట్టింది.
► తైవాన్‌కు చెందిన లూప్ టెలికం 21 లైసెన్స్‌లు పొందింది. తరవాత దీన్ని ఖైతాన్ గ్రూప్ కొనుగోలు చేసింది.
► వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్... డాటాకామ్ సొల్యూషన్స్ పేరిట 21 లైసెన్స్‌లు.
► స్వాన్ టెలికామ్‌కు 13 లైసెన్స్‌లు దక్కాయి. ఎమిరేట్స్‌కు చెందిన ఎటిసలాట్– దేశీ రియల్టీ సంస్థ డీబీ కార్ప్ జతకట్టి స్వాన్‌ను, మరో 2 లైసెన్స్‌లను తీసుకున్నాయి.
► సింగపూర్‌కు చెందిన ఎస్ టెల్ లిమిటెడ్‌కు 6 లైసెన్స్‌లు దక్కగా... దీన్లో వాటాలను బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ (బాటెల్కో) కొనుగోలు చేసింది.
► రష్యాకు చెందిన సిస్టెమా, ఇండియాకు చెందిన శ్యామ్ గ్రూప్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీయే సిస్టెమా శ్యామ్. దీనికి 21 లైసెన్స్‌లు దక్కాయి.
► దేశంలో 3వ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఉన్న ఐడియా... తొలిదశలో 9, రెండో దశలో మరో 4 లైసెన్స్‌లు దక్కించుకుంది. ళీ టాటా 3 లైసెన్స్‌లు దక్కించుకుంది.
ఎవరికెంత నష్టం?
కస్టమర్లు: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం యాక్టివ్ సబ్‌స్క్రైబర్లలో 5 శాతం కస్టమర్లపై ఇది ప్రభావం చూపింది. మొత్తం 89.4 కోట్ల మంది యూజర్లలో 4.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు వారి టెలికం సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకోవాల్సి వచ్చింది. టెలికం రంగంలో పోటీ తగ్గడంతో స్థానికంగా ఉన్న టెలికం కంపెనీలు టారిఫ్ ధరలను కూడా పెంచేశాయి. విదేశాలతో పోలిస్తే సుమారు 30 శాతం ధరలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
విదేశీ పెట్టుబడిదారులు: 2జీ స్కామ్ ప్రభావం 11 కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మరీ ముఖ్యంగా యూఏఈకి చెందిన ఎటిసలాట్, రష్యాకు చెందిన సిస్టెమా, నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్ సంస్థలకు 2జీ దెబ్బ గట్టిగానే తగిలింది. దీంతో విదేశీ టెలికం కంపెనీలకు మన దేశీయ టెలికం రంగంపై నమ్మకం పోయింది. ఇక్కడి టెలికం బిడ్లు, లైసెన్స్ జారీలో పారదర్శకత లేదన్న విషయం తేటతెల్లం కావటంతో ఆ తర్వాత జరిగిన టెలికం బిడ్లలో విదేశీ కంపెనీలేవీ పాల్గొనలేదు. ఇది ఒక రకంగా అప్పడు టెలికం మార్కెట్లో ఉన్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలకు కలిసొచ్చింది.
టెలికం వెండర్స్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కూడా ప్రభావం చూపించింది. నోకియా, సిమెన్స్, ఎరిక్‌సన్, హువావే, విప్రో వంటి టెక్నాలజీ కంపెనీలపై ప్రభావం పడింది. టవర్ల నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి కోసం యూనినార్‌తో నోకియా, సిమెన్స్, ఎటిసలాట్‌తో టెక్ మహీంద్రా ఒప్పందం చేసుకున్నాయి. సుమారు 400 మిలియన్ డాలర్ల ఒప్పందాలు రద్దయ్యాయని అంచనా. బ్యాంకులు, టవర్ల నిర్వహణ కంపెనీలపై కూడా ప్రభావం చూపించింది.
Comments
Please login to add a commentAdd a comment