రైతులకు మరిన్ని ప్రాంతీయ కేంద్రాలు
♦ వారికి వాహన, గృహ, విద్యా, పర్సనల్ లోన్లూ ఇవ్వాలి
♦ ఇవన్నీ వేగవంతం చేసేందుకు మరో 21 రీజినల్ సెంటర్లు
♦ ఏడాదిలో కొత్తగా 70 శాఖలు, 5 ఇన్‌టచ్ సెంటర్లు
♦ ‘సాక్షి’తో ఎస్‌బీఐ తెలంగాణ సీజీఎం హర్దయాల్ ప్రసాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైతులకు పంట రుణాలివ్వటంతోనే బ్యాంకుల పని అయిపోయినట్లు కాదు. కారు, టూవీలర్, ఇల్లు, విద్య, పర్సనల్ లోన్ వంటి ఇతరత్రా అవసరాలకూ ముందుండాలి. మరోవంక ఇతర రుణ గ్రహీతలతో కలిపి వీరిని ఒకే గాటన కట్టకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ సర్కిల్ సీజీఎం హర్దయాల్ ప్రసాద్ చెప్పారు. ఈ ఉద్దేశంతోనే తాము తెలంగాణలో ప్రత్యేకంగా రిటైల్ క్రెడిట్ ప్రాసెసింగ్ సెంటర్లను (ఆర్‌సీపీసీ) ఏర్పాటు చేశామని, ఇవి రైతులకు పంట రుణాలే కాక వారికి అవసరమైన ఇతర రుణాలనూ అందిస్తాయని చెప్పారు. బుధవారమిక్కడ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన పలు అంశాలు మాట్లాడారు. అవి...
తెలంగాణలో ఐదు ఆర్‌సీపీసీలు
రైతులు పంట రుణాలు మినహా ఇతరత్రా రుణాలకోసం రుణదాతలు, బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలతో నష్టపోతున్నారు. ఆర్‌సీపీసీ సెంటర్ల ఏర్పాటుతో వారికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఆర్‌సీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సెంటర్ 20 శాఖలను కవర్ చేస్తుంది. తెలంగాణలో 700 బ్రాంచులు అగ్రికల్చరల్ లోన్లపై పనిచేస్తాయి. వీటిని కవర్ చేయడానికి కొత్తగా మరో 26 ఆర్‌సీపీసీలను ఏర్పాటు చేస్తాం. వారం రోజుల్లోనే రుణాలు మంజూరు చేస్తాం. వాహన రుణాలకైతే ఇంకా తక్కువ సమయం పడుతుంది.
ఆగస్టుకల్లా 70 బ్రాంచీల విలీనం..
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం జరిగింది. మేలో డేటా, ఖాతాల బదిలీ కూడా పూర్తయింది కూడా. ఆయా అనుబంధ బ్యాంకుల వ్యాపారం రూ.13 వేల కోట్లు ఎస్‌బీఐలో విలీనమైంది. ప్రస్తుతం వాటి బ్రాంచీల విలీన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆగస్టు నాటికి 70 శాఖల విలీనం పూర్తవుతుంది. విలీనంలో భాగంగా సేవింగ్స్ ఖాతాలు, ఉత్పత్తులు, రుణాల మంజూరు పద్ధతి, సంస్కృతి వంటి వాటిపై అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. రోజుకు 200 మందికి బృంద శిక్షణలిస్తున్నాం.
కొత్తగా 64 శాఖల ఏర్పాటు..
ప్రస్తుతం తెలంగాణలో ఎస్‌బీఐకి 1,300 బ్రాంచులు, 2,800 ఏటీఎంలున్నాయి. వచ్చే 3 నెలల్లో కొత్తగా 300 ఏటీఎంలు, ఏడాదిలో 64 శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యించాం. తెలంగాణలో 10 ఇన్ టచ్ ఎస్‌బీఐ శాఖలున్నాయి. ఇందులో 9 హైదరాబాద్‌లో, 1 వరంగల్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 5 శాఖలను ఏర్పాటు చేస్తాం. ఇవి ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డిలో వస్తాయి.
ఎస్‌హెచ్‌జీలకు రూ.2 వేల కోట్ల రుణాలు..
రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) గతేడాది రూ.2,300 కోట్ల రుణాలిచ్చాం. ఈ ఏడాది రూ.2 వేల కోట్లు లక్ష్యించాం. రాష్ట్రంలో 1.60 లక్షల ఎస్‌హెచ్‌జీ బృందాలుండగా.. 65 శాతం ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 99 శాతం రైతులకు రూపే కార్డులను పంపిణీ చేశాం. ఇందులో 60 శాతం మంది వినియోగిస్తున్నారు. ఎస్‌బీఐ మొత్తం లావాదేవీల్లో 42 శాతం డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి.