
ఎయిర్‌టెల్ ఏంజెల్ స్టోర్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఏంజెల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. కేవలం మహిళా ఉద్యోగులే వీటిని నిర్వహిస్తారు. స్టోర్‌లో 10 మంది వరకు సిబ్బంది ఉంటారు. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్‌లోని పాట్న నగరంలో తొలి స్టోర్ ఉంది. నెల రోజుల్లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటవుతోంది. స్టోర్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లేయింగ్ జోన్ ఉంటుంది.
కొత్త కనెక్షన్, డీటీహెచ్, రీచార్జ్ సేవలతోపాటు మొబైల్ ఫోన్లు ఇక్కడ విక్రయిస్తారు. వన్ స్టాప్ షాప్‌గా సేవలందిస్తారు. ఎయిర్‌టెల్ ఉద్యోగులే నేరుగా పనిచేస్తారు కాబట్టి ఈ సేవలు వేగంగా జరుగుతాయి. మహిళలకు ఉద్యోగావకాశాల కల్పనలో భాగంగా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఎయిర్‌టెల్ చెబుతోంది. మహిళా ఉద్యోగులు మరింత స్నేహపూర్వకంగా ఉంటారని అంటోంది.
సొంత స్టోర్ల విస్తరణ..
దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ సొంత స్టోర్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు 100 స్టోర్లు రాగా, ఇందులో 14 హైదరాబాద్‌లో, 2 వైజాగ్‌లో నెలకొన్నాయి. సీమాంధ్ర, తెలంగాణలో 2014-15లో ఇటువంటివి 25 దాకా రానున్నాయని ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈఓ వెంకటేశ్ విజయ్‌రాఘవన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.
ఎయిర్‌టెల్‌కు టాప్-3 సర్కిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఉందని, ఈ ప్రాంతంలో 3జీతోపాటు ప్రస్తుత నెట్‌వర్క్ విస్తరణపై దృష్టిపెట్టామన్నారు. ఎయిర్‌టెల్ స్టోర్లలో ప్రతిరోజు 500-600 మంది కస్టమర్లు అడుగుపెడుతున్నారు. కాగా, నైట్ స్టోర్ పేరుతో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం వివిధ ప్యాక్‌లను కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫేస్‌బుక్, ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ కాల్స్, 2జీ డాటా అపరిమితంగా వినియోగించుకోవచ్చు. ప్యాక్‌ల ధర రూ.7-49 వరకు ఉంది.