ముంబైలో రిలయన్స్ గ్రూప్ ఏజీఎం సందర్భంగా , కుమారుడు జై అన్మోల్ అంబానీ, సతీమణి టినా అంబానీలతో ఆ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (మధ్యన)
♦ వచ్చే ఏప్రిల్ కల్లా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిస్టింగ్
♦ కమోడిటీ ఎక్స్చేంజీ మళ్లీ ప్రారంభిస్తాం
♦ వినియోగదారుల రుణాల కోసం కొత్త విభాగం
♦ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ వెల్లడి ఏజీఎమ్‌లో ప్రసంగం
ముంబై: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన వివిధ విభాగాలను త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నామని గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. గృహ రుణ విభాగాన్ని(రిలయన్స్ హోమ్ ఫైనాన్స్) వచ్చే ఏడాది ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన రిలయన్స్ క్యాపిటల్ ఏజీఎమ్ (వార్షిక సాధారణ సమావేశం)లో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో 49 శాతం వాటా రిలయన్స్ క్యాపిటల్ వాటాదారులకే ఉంటుందని, రిలయన్స్ క్యాపిటల్ వాటాదారులకు ఉచితంగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్లను కేటాయిస్తామని అంబానీ వివరించారు.
అంతేకాకుండా వాణిజ్య రుణాల విభాగాన్ని, జీవిత బీమా, సాధారణ బీమా విభాగాలను కూడా తగిన సమయంలో లిస్ట్ చేస్తామని వివరించారు. వాటాదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ సంస్థల లిస్టింగ్‌పై తుది నిర్ణయాన్ని తీసుకుంటాయని వివరించారు. వినియోగదారులకు రుణాలిచ్చే కొత్త విభాగాన్ని అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్స్చేంజీని మళ్లీ ప్రారంభిస్తామని, వజ్రాలు, ముడిచమురు ఫ్యూచర్లపై ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. వజ్రాల ఫ్యూచర్స్ రోజువారీ టర్నోవర్ రూ.6,000 కోట్లు ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది డివిడెండ్ చెల్లింపుల్లో వృద్ధి సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
జీఎస్‌టీతో భారీ మార్పు
వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాలున్నాయని, వడ్డీరేట్లు తక్కువ స్థాయిల్లో ఉన్నాయని, ద్రవ్యోల్బణం కూడా కనిష్ట స్థాయిలోనే ఉందని దీంతో భారత ఆర్థిక వృద్ధి జోరుగా ఉండగలదని పేర్కొన్నారు. జీఎస్‌టీ కారణంగా ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏజీఎంలో రిల యన్స్ క్యాప్ సీఈఓ శామ్ ఘోష్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఆర్‌కామ్‌లో రుణ భారం తగ్గించుకుంటాం: రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ రుణ భారాన్ని ఏడాది కాలంలో 75 శాతం వరకూ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. ఆర్‌కామ్‌లో ఎంటీఎస్, ఎయిర్‌సెల్ విలీన ప్రక్రియలు పూర్తయితే రుణ భారం రూ.20,000 కోట్ల వరకూ తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీల విలీనం పూర్తయితే, దేశంలోనే అత్యధిక స్పెక్ట్రమ్ ఉన్న రెండో అతి పెద్ద కంపెనీగా, 18 కోట్ల మంది వినియోగదారులతో నాలుగో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరిస్తామని వివరించారు.
టవర్ల వ్యాపార విక్రయానికి సంబంధించిన కీలకమైన ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు. తమ తండ్రి ధీరుబాయ్ అంబానీ స్వప్నాన్ని సాకారం చేయడానికి తన సోదరుడు ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఆర్‌కామ్, రిలయన్స్ జియోల అనుబంధం దాదాపు విలీనంలాంటిదేనని అనిల్ అంబానీ అభివర్ణించారు.
అన్మోల్ ప్రభావం..
రిలయన్స్ క్యాపిటల్‌లో కొత్త డెరైక్టర్‌గా తన కుమారుడు అన్మోల్ అంబానీ నియమితులైనప్పటి నుంచి రిలయన్స్ క్యాపిటల్ షేర్ 40 శాతం పెరిగిందని అనిల్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అన్మోల్ ప్రభావం కొనసాగగలదన్న ఆశాభావాన్ని, ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అన్మోల్ డెరైక్టర్‌గా చేరకముందు రిలయన్స్ క్యాపిటల్ షేర్ రూ.467గా ఉంది. సోమవారం ఈ షేర్ రూ.557 ధర వద్ద ముగిసింది. పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అన్మోల్ నియామకాన్ని ఈ ఏజీఎమ్‌లో వాటాదారుల ఆమోదించడం పట్ల వాటాదారులకు అనిల్ అంబానీ కృతజ్జతలు తెలిపారు.