ఊరిస్తున్న యాపిల్..!
శాన్‌ఫ్రాన్సిస్కో: యాపిల్ నుంచి కొత్త గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. పాతికేళ్ల చరిత్రలో అత్యుత్తమ ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం(రేపు) కాలిఫోర్నియాలోని క్యూపెర్టినోలో యాపిల్ నిర్వహిస్తున్న ‘ప్రత్యేక కార్యక్రమం’ ప్రపంచమంతటా ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించబోయే నూతన గ్యాడ్జెట్లు, వాటి ఫీచర్ల గురించి మార్కెట్ వర్గాల అంచనాలు ఇలా ఉన్నాయి...
ఐవాచ్: స్మార్ట్‌వాచ్‌ను యాపిల్ తయారుచేస్తోందంటూ కొన్నేళ్లుగా విన్పిస్తున్న ఊహాగానాలు మంగళవారం వాస్తవరూపం దాల్చే అవకాశం ఉంది. రెండు సైజుల్లో ఉండే ఈ వాచ్‌లలో ఫ్లెక్సిబుల్ స్క్రీన్ ఉంటుందనీ, ధరించే వారి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుందనీ తెలిసింది. ఇది వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చు.
ఐఫోన్ 6: యాపిల్ ఆదాయంలో సగానికిపైగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచే వస్తోంది. మరింత పెద్ద స్క్రీన్లు, సన్నని డిజైన్‌తో రెండు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. ఐఫోన్ 6ను 5.5 అంగుళాలు, 4.7 అంగుళాల స్క్రీన్లతో తీసుకురావచ్చు. గీతలు పడని, మరింత దృఢమైన సఫైర్ మెటీరియల్‌తో స్క్రీన్‌ను కంపెనీ రూపొందిస్తోందని కూడా భావిస్తున్నారు.
మొబైల్ వాలెట్: వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ క్రెడిట్ కార్డ్ కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకుందని అంటున్నారు. ఐఫోన్, స్మార్ట్‌వాచ్‌లలో ఉండే ప్రత్యేక కమ్యూనికేషన్ చిప్ ద్వారా షాపింగ్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తారని సమాచారం.
హెల్త్: ఈ ఏడాది ప్రవేశపెట్టిన ‘హెల్త్‌కిట్’ ద్వారా వినియోగదారులకు ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించనుంది. ఐఫోన్ 6లో హెల్త్‌కిట్‌ను అమ ర్చడం, శారీరక కదలికలు, హృదయ స్పందనను పర్యవేక్షించే సెన్సార్లను స్మార్ట్‌వాచ్‌లో ఏర్పాటు చేయడం ద్వారా మొబైల్ హెల్త్‌కేర్‌కు నాంది పలకనుంది.