నిరాశపరిచిన బజాజ్ ఆటో
క్యూ1లో19% డౌన్; రూ.836 కోట్లు
న్యూఢిల్లీ: దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో ఫలితాల్లో ఉసూరుమనిపించింది. విక్రయాలు పడిపోవడంతో జూన్ త్రైమాసికంలో లాభం ఏకంగా 19 శాతం క్షీణించింది. కంపెనీ రూ.836.79 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,039.70 కోట్లు కావటం గమనార్హం. మొత్తం ఆదాయం కూడా తగ్గి రూ.6,177 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.6,355 కోట్లు. బీఎస్–3 నుంచి బీఎస్–4 కాలుష్య ప్రమాణాలకు మారడంతో పాటు జీఎస్టీ వల్ల కూడా జూన్ త్రైమాసికంలో పరిశ్రమపై ప్రభావం పడిందని బజాజ్ ఆటో తెలియజేసింది.
జూన్ క్వార్టర్లో వాహన విక్రయాలు 8,88,434గా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో నమోదు చేసిన 9,94,733 వాహన విక్రయాలతో పోల్చి చూస్తే 10.68 శాతం తక్కువ. ‘‘జీఎస్టీకి మారడం వల్ల జూన్ 30 నాటికి డీలర్ల వద్ద మిగిలి ఉన్న ఒక్కో వాహనంపై రూ.1,400 సీఎస్టీ, ఆటోసెస్, ఎంట్రీ ట్యాక్స్ రూపేణా నష్టం వాటిల్లింది. దీంతో డీలర్లకు పరిహారం రూపేణా రూ.32 కోట్లు చెల్లించాం’’ అని బజాజ్ ఆటో తెలిపింది. బీఎస్‌ఈలో స్టాక్ ధర గురువారం 0.38 శాతం నష్టపోయి రూ.2,814.15 వద్ద క్లోజయింది.