బ్యాంకుల నెత్తిన నోట్ల రద్దు బండ..!
• పెరుగుతున్న వ్యయాలు
• రుణాలకు డిమాండ్ తగ్గుదల
• తాత్కాలికంగా తప్పని సమస్యలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో కుప్పలకొద్దీ వచ్చి పడిన డిపాజిట్ల ప్రయోజనాలు బ్యాంకులకు ఎప్పుడో దీర్ఘకాలంలో వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం వాటికి సమస్యలు తప్పేట్లు లేవు. ఒకవైపురుణాలకు డిమాండ్ పడిపోవటంతో పాటు మరోవైపు.. కొత్త పరిణామాల కారణంగా అదనపు వ్యయాలు తోడవుతుండటమూ దీనికి కారణం.
భారీ ఎత్తున చలామణిలో ఉన్న రూ. 500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం గత నెలలో ప్రకటించడం బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా కుదిపేసింది. అంత భారీ స్థాయిలో నగదును మళ్లీ రీప్లేస్ చేయాల్సివచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఒక్కసారిగా కొత్త నోట్లకు కొరత ఏర్పడింది. ప్రింటింగ్ ప్రెస్‌లు నిరంతరం పనిచేస్తూనే ఉన్నా.. రద్దయిన నోట్లలో ఇప్పటికి మూడో వంతు నగదు మాత్రమే ఆర్‌బీఐ అందుబాటులోకితేగలిగిందని అంచనా. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపార విశ్వాసం తీవ్రంగా దెబ్బతిని రుణాలకు డిమాండ్ పడిపోయింది. రుణాలివ్వడానికి బ్యాంకుల దగ్గర పుష్కలంగా నిధులున్నప్పటికీ..
పాత నోట్లు డిపాజిట్‌చేసేందుకు వచ్చే ఖాతాదారులను చూసుకోవడంపైనే బ్యాంకు సిబ్బంది ప్రధానంగా దృష్టి పెట్టాల్సి వస్తుండటంతో ఇతరత్రా కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. డీమోనిటైజేషన్‌పై ఆందోళనతో డిపాజిట్ చేసేందుకువస్తున్న ఖాతాదారులకు ముందుగా ఉపశమనం కల్పించడం తమకు ముఖ్యమని, రుణాలివ్వడానికి బోలెడంత సమయం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇప్పటికే రుణ వృద్ధి మందగించినసమస్యతో సతమతమవుతున్న బ్యాంకులకు ఈ పరిణామాలన్నీ గోరుచుట్టుపై రోకటిపోటుగా మారాయి.
మందగించిన రుణ వృద్ధి..
జూలై–సెప్టెంబర్ ›త్రైమాసికంలో మిగతా ప్రపంచ దేశాల కన్నా కూడా వేగవంతంగా భారత ఎకానమీ 7.3 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఉపాధి కల్పనకు కనీసం ఎనిమిది శాతం వృద్ధినైనా నిలకడగా కొనసాగించాల్సిఉంటుంది. ఇందుకోసం ప్రైవేట్ పెట్టుబడులు పెరగాలి. ఎకానమీకి ఊతంగా నిల్చే వివిధ రంగాలకు బ్యాంకులు రుణాలు అందించాలి. ఇది జరగాలంటే బ్యాంకింగ్ రంగం సరిగ్గా ఉండాలి. అయితే చాన్నాళ్లుగా అంతంతమాత్రం లాభదాయకత, మొండిబకాయిల భారంతో కుంగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు.. ప్రస్తుత కష్టం తాత్కాలికమైనదైనా కూడా చాలా బాధాకరమైనదిగానే పరిణమించవచ్చు.
ఒకవేళ వ్యాపారాలు కోలుకోవడానికి ఇంకాఆలస్యమైతే.. ఇక్కట్లు మరింతగా పెరగొచ్చు. ప్రస్తుతం డీమోనిటైజేషన్ దెబ్బతో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, విస్తరణ కోసం లోన్ తీసుకుందామనుకునే వ్యాపారవర్గాలకు రుణం దొరకని పరిస్థితి నెలకొంది. ప్రతీబ్యాంకు సిబ్బందీ కరెన్సీని మార్చే హడావుడిలో ఉండటమే తప్ప తమకు రుణాలివ్వడంపై దృష్టే పెట్టడం లేదని వ్యాపారవర్గాలు ఆవేదన వెలిబుచ్చుతున్నాయి. దీంతో, ఏటా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి చెందుతున్న అమ్మకాలు ఈసారి అంతకు మించి పడిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అంచనాల్లో మార్పులు ..
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రుణ వృద్ధి అంచనాలను బ్యాంకులు సవరించుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కనీసం 10 శాతమైనా రుణ వృద్ధి సాధించాలనినిర్దేశించుకున్నప్పటికీ.. సాధ్యపడకపోవచ్చని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ రుణాలకు డిమాండ్ తగ్గినట్లు పేర్కొన్నాయి. మరోవైపు పాత నోట్లతో బకాయిలను ముందస్తుగా తీర్చేస్తుండటం సైతం మొత్తంరుణాల పోర్ట్‌ఫోలియోపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ లోటు అంతటినీ.. నాలుగో త్రైమాసికంలో భర్తీ చేసుకోవాలని ఎస్‌బీఐ భావిస్తోంది. మరోవైపు, రుణ వృద్ధి మళ్లీ సాధారణస్థాయికి రావడానికి కనీసం రెండు త్రైమాసికాలైనా పట్టేస్తుందని ఇతర బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో S బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి ఆరు శాతానికి పడిపోవచ్చనికన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే 1962 తర్వాత ఇదే అత్యంత తక్కువ స్థాయి వృద్ధి కాగలదు. రుణ వృద్ధి గత ఆర్థిక సంవత్సరం 10.9 శాతంగాను, అంతకు ముందు 9 శాతంగానూ నమోదైంది.
వ్యయాల మోత..
డీమోనిటైజేషన్ దరిమిలా బ్యాంకుల తాత్కాలిక వ్యయాలూ పెరిగాయి. ఉద్యోగులకు ఓవర్‌టైమ్ చెల్లించడం, పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకో లేదా మార్చుకునేందుకో పెద్ద ఎత్తున వస్తున్న ఖాతాదారులనుఅదుపులో ఉంచేందుకు అదనంగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాల్సి వస్తుండటం మొదలైన వాటికోసం బ్యాంకులు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రీకాలిబ్రేట్‌చేసేందుకయ్యే వ్యయాలు వీటికి అదనం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం ఈ వ్యయాలు సుమారు రూ. 35,100 కోట్ల మేర ఉండొచ్చు.
ఇది కాకుండా.. ఈ ఏడాది ఆఖరుదాకా ఏటీఎం లావాదేవీలు, ఇతరత్రా కార్డు చెల్లింపులపై ఫీజులు వసూలు చేయొద్దన్న ఆర్‌బీఐ ఆదేశం కూడా బ్యాంకుల ఆదాయ మార్గాలకు ప్రతికూలంగా మారింది. ఆర్‌బీఐ అనూహ్యంగా కీలక పాలసీ రేట్లనుయథాతథంగా ఉంచడం వల్ల బాండ్ మార్కెట్లు తగ్గడంతో బ్యాంకులు ఇప్పటిదాకా వాటిపై పెట్టుకున్న ఆశలూ ఆవిరైపోయాయి. ప్రస్తుతం అనేకానేక సమస్యల్లో ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో బ్యాంకులకు ఈ పరిణామంమంచిదేనంటున్నారు విశ్లేషకులు. మరిన్ని నిధులు అధికారికంగా వ్యవస్థలోకి రావడం, క్రెడిట్ కార్డుల వినియోగం.. ఇతరత్రా ఆర్థిక సేవల వినియోగం పెరగడం మొదలైనవి ఇందుకు దోహదపడగలవంటున్నారు.