ఆ రుణం ఉంచుకోవద్దు!!
క్రెడిట్ కార్డు!!. అత్యవసర సమయంలో ఆదుకునే ఓ సాధనం. అలాంటపుడు వాడితేనే ప్రయోజనం. అలాకాకుండా అయినదానికీ, కాని దానికీ వాడితే చివరకు వాడేందుకు ఏమీ మిగలదు. ఎక్కువ మంది చేస్తున్నదిదే. ఫలితం... అప్పు తీర్చలేని పరిస్థితిలోకి వెళుతున్నారు. వారి క్రెడిట్ చరిత్రపై బ్లాక్ మార్కు పడిపోతోంది. భవిష్యత్తులో రుణాలు పుట్టని పరిస్థితి ఎదురవుతోంది. అలా క్రెడిట్ కార్డు అప్పుల్లో చిక్కుకున్న వారికోసం నిపుణులుచెప్పిన సలహాల సమాహారమే ఈ కథనం...
క్రెడిట్ కార్డు రుణాలు తీర్చేయటమే బెటర్
⇒ బ్యాంకులో నగదు; ఎఫ్‌డీలు ఏదైనా వాడొచ్చు
⇒ ఆఖరికి వేరే అప్పు చేసైనా ఇది తీర్చేస్తే మేలు
⇒ రుణాల్లో చిక్కుకున్నవారికి నిపుణుల సలహాలివీ..
2015లో దేశంలో క్రెడిట్ కార్డు వినియోగదారులు కార్డుల ద్వారా చేసిన వ్యయం రూ.1,90,000 కోట్లు. ఇదే ఏడాదిలో డెబిట్ కార్డులపై వినియోగం రూ.1,21,300 కోట్లు. ఇది చాలు. క్రెడిట్ కార్డుల కుటుంబంలో చేరుతున్న వారి సంఖ్య ఎలా పెరుగుతోందో చెప్పటానికి. అవసరమేదైనా క్రెడిట్ కార్డుతో గట్టేక్కేయొచ్చన్న ధోరణి పెరగటం వల్లే క్రెడిట్ కార్డుల లావాదేవీలు బుల్లెట్ రైలు వేగంతో విస్తరిస్తున్నాయి.
బ్యాంకులో నగదు... క్రెడిట్ కార్డుపై అప్పు
కొందరు బ్యాంకు ఖాతాలో నగదు ఉంచుకుని క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. ద్రవ్యోల్బణాన్ని కాచుకునే వడ్డీ కూడా గిట్టుబాటు కాని చోటేదైనా ఉందంటే అది బ్యాంకు ఖాతానే. మరి అక్కడ వృథాగా ధనాన్ని పోగేసుకుని... క్రెడిట్ కార్డుపై రెండు మూడు రూపాయల వడ్డీ చెల్లించటం తెలివైన పనా? వెంటనే బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుతో క్రెడిట్ కార్డు అప్పు తీర్చేయటం మంచి చర్య అనిపించుకుంటుంది. అలాగే కొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో దాచుకున్న డబ్బును బయటకు తీయడానికి మనసు ఒప్పక.... క్రెడిట్ కార్డును వాడేస్తుంటారు. ఇది కూడా సరికాదు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఏడు శాతం మించి వడ్డీ రాని పరిస్థితిలో అక్కడ నగదు ఉంచడం కన్నా... ఆ డిపాజిట్‌ను రద్దు చేసి క్రెడిట్ కార్డు అప్పు తీర్చేయడం మంచిది.
ప్రణాళిక మేరకు నడచుకోవాలి...
నగదు అందుబాటులో ఉంటే సమస్య ఎందుకు వస్తుందంటారా...? నగదు అందుబాటులో లేదంటారా? అయితే క్రెడిట్ కార్డుపై పేరుకుపోయిన రుణాన్ని తీర్చేందుకు ఓ ప్రణాళిక రచించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.లక్ష బకాయి ఉంది. దాన్ని ఓ ఏడాదిలో తీర్చాలి. నెలకు అసలు వడ్డీ కలిపి తక్కువలో తక్కువ ఓ పదివేల రూపాయలైనా చెల్లిస్తూ వెళ్లడం ఓ మార్గం.
బదులు అడగండి...
నెలనెలా చెల్లించేటంత ఆర్థిక వెసులుబాటు లేకపోతే... అయిన వారినో, సన్నిహితులనో, స్నేహితులనో నమ్ముకోవాల్సిందే. కాస్త మొహమాటాన్ని పక్కన పెట్టి సమస్య గురించి తెలియజేసి సాయం అడగండి. వడ్డీ లేకుండా సాయం చేసేందుకు ఒక్కరైనా ముందుకు రావచ్చు. దాంతో క్రెడిట్ కార్డు అప్పు తీర్చేయండి. ఒకవేళ వడ్డీ డిమాండ్ చేసినా బ్యాంకు వడ్డీ రేటు... కాదు కూడదంటే మరో రెండు శాతం అదనంగా ఇచ్చినా క్రెడిట్ కార్డు రుణ ఊబి నుంచి బయట పడవచ్చు.
ఎవరూ ఆదుకోలేదా...?
ఎవరూ సాయం చేయకపోయినా... మనస్తాపం చెందకుండా పర్సనల్ లోన్ తీసుకునే ప్రయత్నం చేయండి. 14 శాతం వడ్డీ రేటు నుంచే వ్యక్తిగత రుణాలు లభిస్తున్నాయి. క్రెడిట్ కార్డుపై వడ్డీ కంటే ఇది చాలా చౌక. క్రెడిట్ కార్డులపై వడ్డీ చక్రవడ్డీలన్నీ కలుపుకుని 40 శాతం వరకూ ఉంటుంది. ముందు భారీ వడ్డీ భారాన్ని వదిలించుకుంటే వ్యక్తిగత రుణాన్ని నిదానంగా తీర్చుకోవచ్చు.
సెటిల్‌మెంట్...
ఇక అందుబాటులో ఉన్న మరో మార్గం... ‘ఉన్నపళంగా అంతా తీర్చలేను... రుణాన్ని ఈఎంఐలుగా మార్చండి. రెండేళ్ల గడువు ఇవ్వండి. వడ్డీ తగ్గించండి. లేకుంటే అసలు కూడా చెల్లించే పరిస్థితి లేదు’ అని తేల్చి చెప్పండి. మొండి బకాయిలను వదిలించుకునే పనిలో బ్యాంకులున్నాయి. మీ డిమాండ్‌కు తలొగ్గి ఓ అవకాశం ఇచ్చి చూడవచ్చు. డిమాండ్ చేయాలేగానీ వడ్డీ రేటు 18 శాతానికి, అంతకంటే తక్కువకు కూడా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.
కొత్త రుణంతో పాత రుణానికి బైబై
ఏ విధంగా చూసినా క్రెడిట్ కార్డు రుణం చెల్లించలేని పరిస్థితి ఎదురైతే... మరో క్రెడిట్‌కార్డు తీసుకోవడమే చక్కని పరిష్కారం. కొత్త కార్డుపై వచ్చిన రుణంతో పాత కార్డు రుణం నుంచి విముక్తి పొందవచ్చు. పైగా కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వారికి 3 నెలల వరకు వడ్డీ రహిత రుణాలిచ్చే ఆఫర్లు ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని నెలల పాటు చాలా తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఏదో ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిరోభారంగా మారిన పాత బకాయిని వదిలించుకోవడం మనసును తేలిక పరుస్తుంది.