బిల్లులతో రేటింగ్‌కు సంబంధం లేదు
► చెల్లింపుల్ని రేటింగ్‌లో చేర్చటం ఇంకా చర్చల్లోనే ఉంది
► క్రెడిట్ కార్డులు, గృహ రుణాలకు డి మాండ్ పెరిగింది
► సిబిల్ రిపోర్ట్‌తో రిటైల్ రుణాల్లో డిఫాల్టర్స్ తగ్గారు
► సిబిల్ సీనియర్ వీపీ హర్షలా చందోర్కర్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : క్రెడిట్ స్కోర్ లెక్కించడంలో టెలిఫోన్, మొబైల్, విద్యుత్, బీమా, వాటర్ వంటి బిల్లుల చెల్లింపులను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదని క్రెడిట్ రేటింగ్ సంస్థ సిబిల్ స్పష్టం చేసింది. ఈ చెల్లింపులను పరిగణనలోకి తీసుకోవాలన్న అంశం ఇంకా చర్చల దశలోనే ఉందని, దీనికి ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతి రావాల్సి ఉందని సిబిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్షలా చందోర్కర్ తెలిపారు. క్రెడిట్ రేటింగ్ ఇవ్వడంలో కేవలం క్రెడిట్ కార్డులు, రుణాల చెల్లింపులను మాత్రమే ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు.
వ్యక్తిగత సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, బీమా పథకాలు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయలేవని తెలియజేశారు. ‘‘ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు గానీ, ఏ రకమైన రుణాలను గానీ తీసుకోకపోయి ఉంటే వారి గురించి సిబిల్ ఎలాంటి నివేదికా ఇవ్వదు’’ అని చందోర్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశీయ రుణాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించే నిమిత్తం గురువారమిక్కడ విలేకరులతో ఆమె మాట్లాడారు. గత నాలుగేళ్ళుగా గృహ, ఆటో రుణాలతో పాటు క్రెడిట్ కార్డుల వినియోగం కూడా దేశంలో పెరుగుతోందన్నారు.
‘గతేడాది తొలి 3 నెలల్లో 8 లక్షల క్రెడిట్‌కార్డులు జారీ అయ్యాయి. ఈ ఏడాది అదే సమయంలో 10.8 లక్షల కార్డులు జారీ అయ్యాయి. డిమాండ్ వృద్ధికి ఇదే నిదర్శనం’ అని చెప్పారామె. క్రెడిట్ కార్డులకు ముంబైలో డిమాండ్ అధికంగా ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లున్నాయని తెలియజేశారు.
తగ్గుతున్న ఎన్‌పీఏలు
బ్యాంకులు సిబిల్ రిపోర్ట్ ఆధారంగా రుణాలు ఇస్తుండటంతో ఎన్‌పీఏలు గణనీయంగా తగ్గుతున్నట్లు చందోర్కర్ చెప్పారు. బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో 80 శాతం క్రెడిట్ స్కోర్ 750 దాటినవే ఉండటంతో రుణ ఎగవేతలు బాగా తగ్గాయన్నారు. 2010లో క్రెడిట్ కార్డుల డిఫాల్టర్స్ శాతం 3.27 శాతం నుంచి 1.06 శాతానికి, గృహ రుణాల్లో డిఫాల్టర్లు 1.06 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఇప్పటి వరకు సిబిల్‌లో 22 కోట్లమంది ఖాతాదారులు ఉంటే, వీరు తీసుకున్న రుణాల సంఖ్య 40.6 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుతం సిబిల్ క్రెడిట్ డేటాను 1,400 సంస్థలు వినియోగించుకుంటున్నాయని ఆమె వెల్లడించారు.