ఫ్లిప్‌కార్ట్ సీఈవోగా బిన్నీ బన్సల్
ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సచిన్ బన్సల్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా టాప్ మేనేజ్‌మెంటులో మార్పులు చేపట్టింది. వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్నీ బన్సల్ కొత్త సీఈవోగా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న మరో వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఇకపై సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. బిన్నీ ఇప్పటిదాకా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (సీవోవో) ఉన్నారు. ఈకార్ట్, కామర్స్, మింత్రా తదితర వ్యాపార విభాగాలన్నీ కూడా ఇక నుంచి బిన్నీ బన్సల్ పర్యవేక్షణలో ఉంటాయి. అలాగే కార్పొరేట్ కమ్యూనికేషన్స్, మానవ వనరులు, ఫైనాన్స్ మొదలైన విభాగాలు ఆయన పరిధిలోకి వస్తాయని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సచిన్ బన్సల్.. కంపెనీకి వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తారని వివరించింది. అటు ఫ్లిప్‌కార్ట్‌లో భాగమైన ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్ సంస్థ మింత్రా చైర్మన్ ముకేశ్ బన్సల్ ఇకపై కూడా అదే హోదాలో కొనసాగుతారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ వాణిజ్య కార్యకలాపాలతో పాటు ప్రకటనల విభాగాన్ని కూడా పర్యవేక్షిస్తారు. దేశీయంగా ఈ-కామర్స్‌ను మరింత ప్రాచుర్యంలోకి తేవడంలో ఫ్లిప్‌కార్ట్ కీలక పాత్ర పోషించగలదని సచిన్ బన్సల్ పేర్కొన్నారు.