న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నగదు కొరత(క్యాష్ క్రంచ్)తో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇక్కట్లు రేపటికి మటుమాయమైపోనున్నాయట. దేశవ్యాప్తంగా ఏర్పడిన నగదు కొరత రేపటి వరకు(శుక్రవారం వరకు) పరిష్కారమైపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గురువారం తెలిపారు. నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు ఇప్పటికే కరెన్సీ పంపిచినట్టు చెప్పారు.
సిస్టమ్‌లో నగదు కొరత రూ.70వేల కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ అంతకముందు తెలిపిన సంగతి తెలిసిందే. ఇది ఏటీఎంల నుంచి నెల వారీ విత్‌డ్రా చేసుకునే మొత్తాల్లో మూడవ వంతుగా పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2018లో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి దాదాపు రూ.15,291 బిలియన్లు విత్‌డ్రా అయినట్టు రీసెర్చ్ నోట్ కూడా అంచనావేసింది. ఇది గత ఆరు నెలలతో పోలిస్తే 12.2శాతం ఎక్కువగా పేర్కొంది.
అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 'ఆకస్మిక, అసాధారణ పెరుగుదల' కారణంగా ఈ నగదు కొరత ఏర్పడింది. పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతకముందే రజనీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో చేతిలో డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇలా అసాధారణంగా కొరతను సృష్టించడంలో ఆదాయపు పన్ను అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కర్నాటకలో 30 నుంచి 35 రైడ్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లను ఐటీ ఎక్కువగా ఫోకస్ చేసింది. మరోవైపు రూ.500 నోట్ల ప్రింటింగ్‌ను ప్రభుత్వం ఐదింతలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment