జీఎస్టీ కమిషనర్ అరెస్ట్(ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్(జీఎస్టీ)కి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న వారే అవినీతి కోరల్లో కూరుకుపోతున్నారు. తాజాగా కాన్పూర్ జీఎస్టీ కమిషనర్ సన్సార్ సింగ్‌ను అవినీతి కేసులో భాగంగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు సూపరిటెండెంట్లు, ఒక వ్యక్తిగత స్టాఫ్, ఐదుగురు ప్రైవేట్ అధికారులను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120(బీ), పీసీ యాక్ట్ సెక్షన్ 7, 11, 12 కింద వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. 1986 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఆఫీసర్ అయిన సన్సార్ సింగ్‌ను కాన్పూర్‌లోని జీఎస్టీ కమిషనర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ, కాన్పూర్‌లో అర్థరాత్రి చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా వీరిని అరెస్ట్‌చేశారు. సింగ్ భార్యపైన కూడా అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ ఆమెను ఇంకా అరెస్ట్ చేయలేదు. హవాలా ఛానల్స్ ద్వారా వ్యాపారస్తుల నుంచి సింగ్ నెలవారీ, వారం ఆధారంగా లంచాలు తీసుకుంటున్నారని సీబీఐ అధికారులు తెలిపారు. గత రాత్రి రూ.1.5 లక్షలను తీసుకుంటూ పట్టుబడినట్టు పేర్కొన్నారు. లంచం ఇస్తున్న వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment