
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) స్కామ్ కేసులో 63 మూన్స్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షా తాను బాధితుడినన్న వాదనను లేవనెత్తారు. దేశంలోనే అతిపెద్ద ఈక్విటీ ఎక్సే్చంజ్ ఎన్‌ఎస్‌ఈకి లబ్ధి కలిగించాలన్న దురుద్దేశంతో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్‌ఎస్‌ఈఎల్ దెబ్బితినేలా వ్యవహరించారని ఆరోపించారు. రూ.10వేల కోట్ల పరిహారం కోరుతూ చిదంబరంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి కేపీ కృష్ణన్, ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్‌ఎంసీ) మాజీ చైర్మన్ రమేష్ అభిషేక్‌లకు ఈ వారంలోనే 63 మూన్స్ లీగల్ నోటీసులను కూడా పంపించింది.
‘‘ఎన్‌ఎస్‌ఈఎల్‌ను అంతం చేయాలన్న దురుద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు ఇది. ఎక్సేంజ్ విభాగం నుంచి మమ్మల్ని అంతం చేసేందుకు కుట్ర జరిగింది’’ అని జిగ్నేష్ షా మీడియాకు తెలిపారు. ఎన్‌ఎస్‌ఈఎల్ దేశంలోనే తొలి కమోడిటీ స్పాట్ ఎక్సేంజ్. జిగ్నేష్ షాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (63మూన్స్ పూర్వపు పేరు) పూర్తి అనుబంధ కంపెనీ ఇది. అయితే, ఇన్వెస్టర్లు బుక్ చేసుకున్న ఆర్డర్లను గోదాముల నుంచి డెలివరీ చేయకపోవడంతో రూ.5,600 కోట్ల మేర అవకతవకలు 2013 జూలై 31న వెలుగు చూశాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఈఎల్ నిలిపివేతకు ఆదేశించింది. ఇదే కేసులో షా 2014 మే నెలలో అరెస్ట్ అయ్యారు. దాంతో దాదాపు అరడజను ఎక్సే్చంజ్‌లపై ఆయన నియంత్రణ కోల్పోవాల్సి వచ్చింది. ‘‘నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ఎన్‌ఎస్‌ఈఎల్ స్కామ్‌ను ప్రైవేటు కేసుగా పేర్కొన్నారు. కంపెనీ, వాటాదారుల ద్వారా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుందని ప్రకటించారు. మరి ఎఫ్‌ఎంసీ ద్వారా ఎందుకు పరిష్కరించలేదు?’’ అని షా సందేహాలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment