భారత్ సహా 50 దేశాల సంతకాలు
ఆసియా దేశాల్లో మౌలిక రంగ వృద్ధి లక్ష్యం
అమెరికా, యూరప్ ప్రాబల్య
బ్యాంకులకు పోటీపూర్వక వ్యవస్థ
ఈ ఏడాది చివరికల్లా కార్యకలాపాలు!
బీజింగ్: చైనా నేతృత్వంలోని 100 బిలియన్ డాలర్ల ఆసియాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఏర్పాటు దిశలో ముందడుగు పడింది. బ్యాంకు చట్టబద్దతకు సంబంధించి ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై భారత్‌సహా 50 దేశాలు సోమవారం సంతకాలు చేశాయి. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆసియా దేశాల్లో మౌలిక రంగం వృద్ధే లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటవుతోంది. బహుళజాతి బ్యాంకర్‌గా అమెరికా, యూరప్ ప్రాబల్య బ్యాంకింగ్ సంస్థలకు (ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) ఏఐఐబీ పోటీపూర్వక పరిస్థితి సృష్టిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది చివరికల్లా బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యాంశాలు...
ఇది 60 అధికరణల ఒప్పందం. సభ్యదేశాల షేరింగ్, బ్యాంకింగ్ పాలనా వ్యవస్థ, విధాన నిర్ణయ యంత్రాంగం, వంటి అంశాలను ఈ అధికరణలు నిర్దేశిస్తున్నాయి. ఒప్పందంపై సంతకం చేసిన మొట్టమొదటి దేశం- ఆస్ట్రేలియా. తరువాత 49 ఇతర దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరో 7 దేశాలు వాటివాటి చట్టసభల నుంచి ఆమోదం తరువాత ఈ ఏడాది చివరికల్లా సంతకాలు చేయాల్సి ఉంది.
ఏఐఐబీ అథీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లు. ఇందులో 75 శాతం ఆసియన్ దేశాలు సమకూర్చుతాయి. ప్రతి దేశానికి దాని ఆర్థిక పరిమాణం ప్రాతిపదిన కోటా ఉంటుంది.30.34 శాతంతో చైనా, 8.52తో భారత్, 6.66 శాతంతో రష్యా మూడు అతిపెద్ద వాటాదారులుగా ఉండనున్నాయి. దీనిని బట్టి వోటింగ్ షేర్ 26.06 శాతం, 7.5 శాతం, 5.92 శాతంగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలకు సంబంధించి చైనాకు వీటో అధికారం ఉండే అవకాశమూ ఉంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కార్యక్రమానికి హాజరవనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, దీనికి భిన్నంగా కొద్దిమంది భారత్ ప్రతినిధులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. చైనాలో భారత్ రాయబారి అశోక్ కే కాంతా ఒప్పందంపై సంతకం చేశారు.
ఏఐఐబీ బ్యాంక్ ఏర్పాటులో ముందడుగు
Published Tue, Jun 30 2015 1:06 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement