క్యూ2లో చైనా వృద్ధి 6.9%
6.5 శాతం లక్ష్యం కన్నా అధికం
బీజింగ్: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఇది ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకున్న 6.5 శాతం కన్నా అధికం. ఈ నేపథ్యంలో అధిక రుణభారం ఉన్నప్పటికీ.. 2017 వృద్ధి లక్ష్యాలను చైనా సునాయాసంగా అధిగమించగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దాదాపు తొలి త్రైమాసికం స్థాయిలోనే రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదైంది. తమ ఎకానమీ సముచిత శ్రేణిలో స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తున్నామని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) ప్రతినిధి జింగ్ జిహాంగ్ తెలిపారు.
వార్షిక వృద్ధి లక్ష్యం సాధన దిశగా పటిష్టమైన పునాది ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తాజా గణాంకాల నేపథ్యంలో చైనా క్యూ3 వృద్ధి అంచనాలను గతంలో పేర్కొన్న 6.6 శాతంనుంచి 6.8 శాతానికి, వార్షిక వృద్ధిని 6.7 శాతం నుంచి 6.8 శాతానికి పెంచుతున్నట్లు నొమురా సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అటు ప్రాపర్టీ రంగంలో మందగమనం, దేశీయంగా డిమాండ్ తగ్గే అవకాశాలు, అంతర్జాతీయంగా డిమాండ్‌పై అనిశ్చితి నెలకొన్నందున వృద్ధి క్రమంగా మందగించవచ్చన్న అంచనాలు కొనసాగవచ్చని తెలిపింది. జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో చైనాలోని పట్టణప్రాంతాల్లో సుమారు 73.5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఇది గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,80,000 అధికం. గతేడాది కన్నా పది లక్షలు అధికంగా ఈ ఏడాది దాదాపు 1.1 కోట్ల మేర ఉద్యోగాలు కల్పించాలని చైనా నిర్దేశించుకుంది.