ఖరీదైనా.. మార్కెట్‌ ముందుకే! | Closing Bell: Market ends almost flat on profit booking | Sakshi
Sakshi News home page

ఖరీదైనా.. మార్కెట్‌ ముందుకే!

Published Sat, Mar 18 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

ఖరీదైనా.. మార్కెట్‌ ముందుకే!

ఖరీదైనా.. మార్కెట్‌ ముందుకే!

ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ ఖరీదైనదే...
వాల్యుయేషన్‌ అధిక స్థాయిలో ఉంది...
అయినా, మరింత ఎగబాకే చాన్స్‌...
సంస్కరణల జోరు.. మెరుగైన వృద్ధి రేటు తోడ్పాటు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ ఎస్‌. నరేన్‌ అభిప్రాయం  


ముంబై: ప్రధాని మోదీ ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో సాధించిన భారీ విజయంతో దేశీ స్టాక్‌ మార్కెట్లో బుల్‌ రంకెలేస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రోజుకో కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని తాకి అప్రతిహతంగా దూసుకుపోతోంది. సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ గరిష్టానికి కాస్త దూరంలోనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లోకి డాలర్‌ నిధులను కుమ్మరిస్తున్నారు. మరోపక్క, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కూడా వడ్డీరేట్లను పావు శాతం పెంచడంతో రేట్ల పెంపుపై అనిశ్చితికి తెరపడింది. ఇది కూడా ఒకరకంగా మార్కెట్లకు ఇంధనంగా పనిచేస్తోంది.

ఇలాంటి తరుణంలో మార్కెట్లోకి ప్రవేశించడం మంచిదేనా... రానున్న కాలంలో ఏవిధంగా ఉంటాయి అన్న సందేహాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. అయితే, ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే మన మార్కెట్ల వాల్యుయేషన్‌ చాలా అధికంగా ఉందని.. అయినప్పటికీ మరింత ఎగబాకేందుకు అవకాశం కనబడుతోందని... దేశంలోనే టాప్‌ ఫండ్‌ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ) శంకరన్‌ నరేన్‌ అంటున్నారు.

వాల్యుయేషన్‌లో జపాన్‌ను మించిన భారత్‌...
భారత్‌ మార్కెట్లు గడిచిన కొద్ది నెలలుగా దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో అపూర్వ విజయాన్ని దక్కించుకోవడంతో నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్టాలతో పరుగులు తీస్తోంది. గురువారం కూడా ఇంట్రాడేలో 9,218 పాయింట్ల కొత్త గరిష్టాన్ని తాకింది. 9,160 పాయింట్ల ముగింపుతో మరో రికార్డును నమోదు చేసింది. సెన్సెక్స్‌ కొత్త రికార్డులకు దాదాపు మరో 400 పాయింట్లు దూరంలో మాత్రమే ఉంది. కాగా, తాజా ర్యాలీతో భారత్‌ స్టాక్‌ మార్కెట్లు ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో జపాన్‌ను వెనక్కినెట్టి వాల్యుయేషన్‌ పరంగా(బుక్‌ వాల్యూ, పీఈ) అత్యంత ఖరీదైనదిగా అవతరించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ గురు వారెన్‌ బఫెట్‌ జీడీపీ–మార్కెట్‌ క్యాప్‌ సిద్ధాంతం ప్రకారం.. ప్రస్తుతం మన మార్కెట్‌ వాల్యుయేషన్‌ గరిష్టాలకు చేరువవుతోంది.

మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) డాలర్ల రూపంలో ఇప్పుడు 1.82 ట్రిలియన్లకు చేరింది. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) విలువ(సుమారు 2.1 ట్రిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే మార్కెట్‌ క్యాప్‌ 87 శాతానికి చేరింది. 2007లో జీడీపీలో మార్కెట్‌ క్యాప్‌ 147 శాతానికి చేరడం గమనార్హం. ఆతర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బకు మన మార్కెట్లు సైతం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా, ప్రైస్‌ టు ఎర్నింగ్స్‌(కంపెనీల రాబడులతో పోలిస్తే మార్కెట్‌ విలువ–పీఈ) ప్రకారం చూస్తే మార్కెట్లు ఖరీదైనవే అయినప్పటికీ.. ప్రైస్‌ టు బుక్, మార్కెట్‌ క్యాప్‌–జీడీపీల నిష్పత్తితో పోలిస్తే వాల్యుయేషన్లు ఇంకా చౌకగానే ఉన్నట్లు లెక్క అని నరేన్‌ చెబతున్నారు. మరింత పెరిగే అవకాశం ఉందనేందుకు దీన్ని కారణంగా చూపుతున్నారు.

ఇప్పుడేంటి పరిస్థితి...
గతంలో వాల్యుయేషన్స్‌ గరిష్ట స్థాయిలకు చేరినప్పుడు మన మార్కెట్లు భారీగా పతనమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని... అందువల్ల ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మేలనేది మరికొందరు నిపుణుల విశ్లేషణ. 2007లో, 2015లో మార్కెట్‌ క్షీణతను దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. 2015–16లో మన స్టాక్‌ మార్కెట్‌ 23 శాతం మేర దిగజారగా... ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 2008లో 52 శాతం మేర కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే, ఆ స్థాయి వాల్యుయేషన్స్‌కు చేరేందుకు ఇంకా అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రధాన సూచీలోని షేర్లు బుక్‌ వేల్యూతో పోలిస్తే 2.9 రెట్ల ధరకు ట్రేడవుతున్నాయి. ఇదే 2015 మార్చిలో ఇది 3.1 రెట్లుగా నమోదైంది.

ఇక ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్‌(సూచీలు) పీఈ నిష్పత్తి 22.5గా ఉంది. ఇది 2015 నాటి గరిష్టస్థాయికి చేరుకుంది. మోదీ పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) తర్వాత గతేడాది డిసెంబర్‌లో ఆరు నెలల కనిష్టానికి పడిపోయిన దేశీ మార్కెట్‌.. ఆతర్వాత మళ్లీ ఎగబాకడం మొదలైంది. గడిచిన ఐదు నెలల్లో తొలిసారిగా ఫిబ్రవరిలో విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మార్చిలోనూ ఇప్పటిదాకా డెట్, ఈక్విటీల్లో కలిపి నికరంగా విదేశీ ఇన్వెస్టర్లు రూ.15,000 కోట్లు కుమ్మరించారు. ఇదే మార్కెట్‌ ర్యాలీకి ప్రధాన ఇంధనం. కాగా, మార్కెట్లు ఒకేదిశగా ఎగబాకుతూపోవడం అత్యంత ఆందోళనకరమని నరేన్‌ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సంస్కరణలపై ఆశలు...
మోదీ ఘన విజయంతో మరిన్ని భారీ సంస్కరణలకు కేంద్రం తెరతీయనునందన్న అంచనాలు నెలకొన్నాయి. దీనివల్ల పెట్టుబడులు పెరిగి.. ప్రైవేటు రంగంలో వ్యయాలు జోరందుకుంటాయని భావి స్తున్నారు. మార్కెట్లలో జోష్‌కు ఇదీ ఒక కారణమే. ఇక నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ... జీడీపీ వృద్ధి 7% వృద్ధి చెందుతుందన్న తాజా గణాంకాలు కూడా ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణికి దోహదం చేస్తోంది. అయితే మొండిబాకాయిల సమస్యతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న బ్యాంకులు.. కార్పొరేట్లకు రుణాలిచ్చేందుకు వెనుకాడుతున్నాయని.. ఇది పెట్టుబడులప్రభావం చూపొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘వచ్చే రెండేళ్లలో కంపెనీల సామర్థ్య వినియోగం, నిర్వహణ మెరుగుపడే అవకాశం ఉంది. మార్కెట్లు రానున్న కాలంలో మరింత వృద్ధి చెందుతాయనేందుకు దీన్ని సంకేతంగా భావించవచ్చు’ అని నరేన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement