ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన కీలక ఎగ్జిక్యూటివ్‌లకు వేతన పెంపును కేవలం సింగిల్-డిజిట్‌లోనే చేపట్టింది. కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్కో డి సౌజాతో పాటు మిగతా ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు - అధ్యక్షుడు రాజీవ్ మెహతా, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కరేన్ మెక్లౌగ్లిన్ వేతనాలను 2017లో కేవలం 3 శాతం నుంచి 8 శాతం మధ్యలోనే పెంచినట్టు వెల్లడైంది. మార్కెట్ ట్రెండ్‌లను పరిగణలోకి తీసుకున్న కాగ్నిజెంట్ ఈ మేరకు మాత్రమే వేతన పెంపును చేపట్టింది.
ప్రత్యక్ష పరిహారాల్లో డి సౌజా పరిహారాలు మొత్తంగా 3 శాతం పెరిగాయి. 2017లో ఈయన పరిహారాలు 12.23 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 3 శాతం మాత్రమే పెరిగాయి. ఇక మెహతా పరంగా చూసుకుంటే, ఆయన 2016 సెప్టెంబర్‌లో అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందినప్పుడు 14 శాతం పెంపు చేపట్టారు. అనంతరం 2017లో మొత్తంగా ప్రత్యక్ష పరిహారాల్లో కేవలం 3 శాతం పెంపును మాత్రమే ఆయన పొందినట్టు తెలిసింది. ఆయన వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 2016 నుంచి 3 శాతం, 4 శాతం చొప్పున పెరిగాయి.
మెక్లౌగ్లిన్ కూడా మొత్తంగా 2017లో తన ప్రత్యక్ష పరిహారాల్లో 8 శాతం పెంపును పొందారు. అయితే 2016లో ఆమెకు బేస్ శాలరీ, వార్షిక నగదు ప్రోత్సహాకాల్లో 17 శాతం పెంపు ఉంది. ఆమె పీఎస్‌యూ, ఆర్‌ఎస్‌యూ గ్రాంట్‌లు 5 శాతం, 6 శాతం చొప్పున ఉన్నాయి. 2017, 2016లలో కంపెనీ పనితీరు పరంగా ఎగ్జిక్యూటివ్‌ల పరిహారాల పెంపును చేపట్టామని కంపెనీ చెప్పింది. పరిశ్రమ అంచనాలు, కంపెనీ లక్ష్యాలు, ఎగ్జిక్యూటివ్‌ల పనితీరు, బాధ్యత, ఎగ్జిక్యూటివ్ టాలెంట్ మార్కెట్ వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment