5 నెలల గరిష్టానికి వినియోగదారుల ద్రవ్యోల్బణం
Published Tue, Sep 12 2017 6:17 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
సాక్షి, ముంబై : వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి ఎగిసింది. ఆగస్టు నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.36 శాతంగా నమోదైంది. ఆహారం, ఇంధన ధరలు ఎక్కువగా పెరుగడంతో ఈ ద్రవ్యోల్బణం పెరిగిందని మంగళవారం ప్రభుత్వం వెలువరించిన డేటాలో వెల్లడైంది. జూలై నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.36 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో పారిశ్రామికోత్పత్తి రికవరీ అయింది. జూలై నెలలో దీని వృద్ధి 1.2 శాతంగా నమోదైనట్టు తెలిసింది. జూన్ నెలలో ఈ ఉత్పత్తి కేవలం 0.2 శాతంగానే ఉంది. రాయిటర్స్ డేటా అంచనాల ప్రకారం ఆగస్టు నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.20 శాతంగానే ఉంటుందనని తెలిసింది.
ఇటీవల కాలంలో వచ్చిన వర్షాల వల్ల పంటలు భారీగా దెబ్బతినడంతో, ఆహార ఉత్పత్తుల ధరలు పైకి ఎగిశాయి. వరుసగా మూడు నెలల పాటు కిందకి దిగజారిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూలై నుంచి పెరుగడం ప్రారంభమైంది. అయినప్పటికీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4 శాతం కంటే తక్కువగానే ఉంది. హోల్‌సేల్ ధరలు కూడా 3 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి.
Advertisement