సాక్షి, ముంబై : దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కు కోవిడ్-19 షాక్ తగిలింది. మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 1,388 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అంతకు ముందు సంవత్సరం 1,505 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. తాజా ఫలితాలతో విశ్లేషకులు అంచనాలను బ్యాంకు తారుమారు చేసింది. విశ్లేషకులు 1,556 కోట్ల రూపాయల లాభాలను అంచనా వేశారు. మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. మరోవైపు నికర వడ్డీ ఆదాయం సంవత్సరానికి 16 శాతం పెరిగి రూ. 25,206 కోట్లకు చేరుకుంది.
గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా ప్రొవిజన్లు నమోదయ్యాయి. గత ఏడాది 3,000 కోట్లు తో పోలిస్తే ఈ త్రైమాసికంలో 7,730 కోట్లుగా ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో యాక్సిస్ బ్యాంకు వెల్లడించింది. అయితే స్థూల బ్యాడ్ లోన్ల బెడద 4.86 శాతానికి తగ్గింది. మార్చిలో ముగిసిన త్రైమాసికంలో నికర ఎన్‌పిఎలు 1.56 శాతానికి తగ్గాయి.
మరోవైపు యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో 29 శాతం వాటాను కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ లైఫ్ మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యంతో బ్యాంక్ వాటా 30 శాతానికి చేరి, అతి పెద్ద వాటాదారుగా నిలవనుంది. ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఎఫ్ఎస్)ను మాక్స్ లైఫ్‌లో విలీనం కావడమే భాగస్వామ్యం యొక్క దీర్ఘకాలిక ఉద్దేశం. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్ మధ్య 70:30 జాయింట్ వెంచర్ ఏర్పాటుకానుంది. లావాదేవీ పూర్తి కావడానికి ఆరు నుండి తొమ్మిది నెలల కాలం పట్టునుందని, తద్వారా తమ వాటాదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించాలని భావిస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్, ఎంఎఫ్ఎస్ఎల్ ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఒప్పందానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), సీసీఐ ఆమోదం లభించాల్సి వుంది.
Comments
Please login to add a commentAdd a comment