
గ్రూప్ భవిష్యత్తు కోసమే మిస్త్రీపై వేటు..
టాటా గ్రూప్‌లో ‘మిస్త్రీ’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వేటు పడిన సైరస్ మిస్త్రీ, తాత్కాలిక చైర్మన్‌గా ...
• ఘాటుగా స్పందించిన రతన్ టాటా
• అన్నీ ఆలోచించాకే కఠిన నిర్ణయం తీసుకున్నాం..
ముంబై: టాటా గ్రూప్‌లో ‘మిస్త్రీ’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వేటు పడిన సైరస్ మిస్త్రీ, తాత్కాలిక చైర్మన్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టిన రతన్ టాటాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మిస్త్రీ తాజా ఆరోపణలను తిప్పికొడుతూ రతన్ టాటా తమ ఉద్యోగులకు రాసిన తాజా లేఖలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘టాటా గ్రూప్ ఉజ్వల భవిష్యత్తు కోసమే మిస్త్రీని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాం. బోర్డు సభ్యులు దీన్ని తీవ్రంగా పరిశీలించి, చర్చించిన తర్వాతే నాయకత్వ మార్పు తప్పనిసరి అన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.
గ్రూప్ భవిష్యత్తు బాగుండాలంటే మిస్త్రీపై వేటు అత్యంత ఆవశ్యకమని బోర్డు సభ్యులంతా భావించారు’ అని రతన్ టాటా లేఖలో తేల్చిచెప్పారు. కొత్త నాయకత్వం వచ్చేంతవరకూ గ్రూప్‌లో స్థిరత్వం, నాయకత్వ లేమి లేకుండా చూడటం కోసమే తాను మళ్లీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించానని తన పునరాగమనాన్ని సమర్థించుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో టాటా గ్రూప్ అత్యున్నన్న స్థానాన్ని నిలబెట్టడమే తన ప్రస్తుత కర్తవ్యమని స్పష్టం చేశారు.
డొకోమోతో నిర్ణయాలన్నీ రతన్‌కు తెలుసు: మిస్త్రీ
జపాన్ టెలికం దిగ్గజం ఎన్‌టీటీ డొకోమోతో జాయింట్ వెంచర్‌కు (జేవీ) సంబంధించిన వివాదంలో సరిగ్గా వ్యవహరించలేదంటూ తనపై చేసిన పరోక్ష విమర్శలను తిప్పికొడుతూ మిస్త్రీ తాజా లేఖాస్త్రం సంధించిన కొద్దిసేపటికే రతన్ టాటా కూడా లేఖ రాయడం గమనార్హం.‘టాటా డొకోమో జేవీకి సంబంధించి, ఆ తర్వాత తలెత్తిన వివాదం విషయంలో అన్ని నిర్ణయాలకూ టాటా సన్స్ బోర్డు ఏకగ్రీవ ఆమోదం ఉంది. రతన్ టాటాకు తెలిసే ఇవన్నీ జరిగాయి’ అని మంగళవారం మిస్త్రీ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. డొకోమో వివాదాన్ని పరిష్కరించుకోవడంలో మిస్త్రీ అసమర్థంగా వ్యవహరించారని.. ఇది టాటా గ్రూప్ సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధమంటూ చేస్తున్న విమర్శలన్నీ నిరాధారమని మిస్త్రీ తిప్పికొట్టారు. దీనిపై టాటా గ్రూప్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. డొకోమో వివాదంలో తనను విమర్శిస్తున్నారన్న భావనలో మిస్త్రీ ఉన్నారని.. అయినా, ఈ అంశం కోర్టులో ఉందని చెప్పారు.
లాభాలపైనే దృష్టిపెట్టండి..
మిస్త్రీపై వేటు(అక్టోబర్ 24న) తర్వాత గ్రూప్‌లోని దాదాపు 6.6 లక్షల మంది ఉద్యోగులను ఉద్దేశిస్తూ రతన్ టాటా లేఖ రాయడం ఇది రెండోసారి. కాగా, గ్రూప్ కంపెనీలన్నీ లాభాల మార్జిన్లు మెరుగుపరుచుకోవడం, మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడంపైనే దృష్టిసారించాలని ఆయన నిర్ధేశించారు. గతంతో పోల్చుకోవద్దని.. ఒకరిని అనుసరించడం కాకుండా, ముందుండి నడిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఉద్యోగులకు ఉద్బోధించారు. ‘మీతో మళ్లీ కలిసిపనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.
ఒక అత్యున్నత కార్పొరేట్ గ్రూప్‌గా దశాబ్దాలుగా పటిష్టంగా ఉన్న టాటా సంస్కృతి, విలువలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో కృషిచేయాలి. అనేక సవాళ్లు, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. గొప్ప కంపెనీలను నెలకొల్పడంలో, వాటాదారులకు మరింత విలువను అందించడంలో మీరు(ఉద్యోగులు) కనబరిచిన స్ఫూర్తి అద్వితీయం’ అని ఆయన రతన్ వ్యాఖ్యానించారు.
రాజీనామా ప్రకంపనలు..
మిస్త్రీపై వేటు నేపథ్యంలో టాటా గ్రూప్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలు ఊపందుకుంటున్నాయి. చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మిస్త్రీ హయాంలో ఏర్పాటైన గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను (జీఈసీ) కూడా టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు రద్దు చేయటంతో వీటిలో కీలక సభ్యులుగా ఉన్న ముకుంద రాజన్, నిర్మల్య కుమార్ తమ పదవుల నుంచి వైదొలిగారు. అదేవిధంగా టాటా కెమికల్స్ కూడా తమ నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నిర్మల్య కుమార్ అక్టోబర్ 31న రాజీనామా చేసినట్లు తెలిపింది. జీఈసీలో మరో సుభ్యుడైన మధు కన్నన్ కూడా గత వారంలోనే టాటా గ్రూప్ నుంచి తప్పుకోవడం గమనార్హం.
డొకోమో వివాదమేంటి..?
2009లో టాటా టెలీ సర్వీసెస్‌తో జాయింట్ వెంచర్(జేవీ) ఒప్పందం కుదుర్చుకున్న జపాన్ దిగ్గజం ఎన్‌టీటీ డొకోమో... 26.5 శాతం వాటాను రూ.12,700 కోట్లకు (షేరుకు రూ.117 విలువతో) కొనుగోలు చేసింది. అయితే, ఐదేళ్ల తర్వాత తాము కొనుగోలు చేసిన ధరలో సగం రేటుకు జేవీ నుంచి అవసరమైతే వైదొలిగే షరతుపై డొకోమో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టాటా డొకోమో జేవీ అనుకున్నంత విజయం సాధించకపోవడతో డొకోమో 2014 ఏప్రిల్‌లో వైదొలగాలని నిర్ణయించుకుం ది. షేరుకు రూ.58 ధర చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే, టాటాలు షేరుకు రూ.23.34 మాత్రమే ఇస్తామన్నారు.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ సంస్థ జేవీ తమ పెట్టుబడులను వెనక్కితీసుకోవాలంటే.. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) ఆధారంగా కంపెనీ విలువను (వేల్యుయేషన్) లెక్కించాల్సి వస్తుందంటూ టాటా మెలికపెట్టింది. జేవీ నుంచి వైదొలగడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ డొకోమో టాటా గ్రూప్‌పై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. టాటాలు ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకుగా ను 1.17 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.7,800 కోట్లు) నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. అయితే, భారతీయ విధానాలు, చట్టాలమేరకే తాము వ్యవహరిస్తామని.. ఆర్బిట్రేషన్ ఉత్తర్లులను అమలు చేయడం కుదరదని టాటా సన్స్ చెబుతోంది.