నా వయస్సు 52 సంవత్సరాలు. నా ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) ఖాతా త్వరలో మెచ్యూర్ కానున్నది. రూ. 20 లక్షల వరకూ నగదు వస్తుంది. ఇప్పట్లో నాకు ఈ డబ్బులు అవసరం లేదు. పీపీఎఫ్ ఖాతా గడవును పొడిగించమంటారా ? లేక ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సలహా ఇవ్వండి. – ఆనందరావు, విశాఖపట్టణం
మీరు ఈ పీపీఎఫ్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పీపీఎఫ్‌లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు మరింత అధికంగా రాబడులు వచ్చేవి. భవిష్యత్తులో పీపీఎఫ్ వడ్డీరేట్లు మరింతగా తగ్గుతాయి. అందుకని పీపీఎఫ్ ఖాతాను పొడిగించకపోవడమే మంచిది. మీకు ఐదు, అంతకు మించిన సంవత్సరాలకు ఈ డబ్బులు అవసరం లేకపోతే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. అయితే స్వల్పకాలంలో మాత్రం మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానాన్ని అనుసరించండి. ఒకటి లేదా రెండు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మీ పీపీఎఫ్ మొత్తాన్ని మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని, ఈ మొత్తాలను ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా ? ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా ? దేనిని ఎంచుకోవాలి? – ప్రశాంతి, హైదరాబాద్
మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు? మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అనే అంశాలను ఆధారంగా ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి. డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్... ఇవి రెండూ వేర్వేరు ఇన్వెస్ట్‌మెంట్ అవసరాల కోసం ఉద్దేశించినవి. సాధారణంగా స్వల్పకాలిక అవసరాల కోసం డెట్ ఫండ్స్‌ను, దీర్ఘకాలిక అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. ఉదాహరణకు ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లలను పెద్ద చదువులు చదివించడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, నిలకడైన రాబడులు వస్తాయి. కానీ వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. వీటిల్లో నష్టభయం తక్కువగా ఉంటుంది. రాబడులు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి స్వల్పకాలిక పెట్టుబడి అవసరాల కోసం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మరో వైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు అధికంగా వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి స్వల్పకాలంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ ఫండ్స్‌లో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్‌లో ఎదురయ్యే ఒడిదుడుకులను సిప్‌ల ద్వారా అధిగమించవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొనడమే కాకుండా, దీర్ఘకాలంలో మంచి రాబడులు కూడా పొందవచ్చు. మీరు మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా ఒకటి లేదా రెండు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ తమ కార్పస్‌లో 65 శాతాన్ని ఈక్విటీలోనూ, మిగిలిన దానిని డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో సిప్ విధానంలో రెండు, మూడేళ్లు ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్స్ విషయమై మీకు కొంత అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో రెండు, లేదా మూడు మంచి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని, వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. మార్కెట్ బాగా పెరిగినా, లేదా బాగా పతనమైనా సిప్‌లను ఆపేయక, కొనసాగించండి. మీ జీతం పెరిగినప్పుడల్లా, సిప్ మొత్తాన్ని పెంచడం మరువకండి.
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సురక్షితమేనా ? వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? – రవి, నెల్లూరు
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌పై తీవ్రంగానే ఉంటుంది. అందుకని స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సురక్షితమైనవేనని చెప్పలేము. మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఇవి మంచి రాబడులను ఇస్తాయి. మార్కెట్ పతనమైనప్పుడు భారీగా నష్టపోతాయి. ఈ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో రిస్క్ అధికంగా ఉంటుంది. అధిక రిస్క్ ఉన్నట్లే, అధిక రాబడులూ వచ్చే అవకాశాలుంటాయి. మీరు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నా, రిస్క్ భరించడానికి సిద్ధంగా లేకున్నా ఈ ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. మీ వయస్సు 30 లోపు ఉండి, రిస్క్ భరించగలిగే సామర్థ్యం ఉందనుకుంటే, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఒక ఇన్వెస్టర్ తాను ఇన్వెస్ట్ చేసే మొత్తంలో 20–30 శాతం మాత్రమే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు కేటాయించాలి. అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
డెట్ ఫండా? ఈక్విటీ ఫండా? దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి?
Published Mon, Aug 20 2018 12:58 AM | Last Updated on Mon, Aug 20 2018 12:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment