ముంబై : ధీరుబాయి అంబానీగా పేరుపొందిన ధీరాజ్లాల్ హిరచాంద్ అంబానీ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పేదరికం నుంచి అత్యంత ధనికుడైన భారతీయుడు ఇతను. ఆయన స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచ వ్యాపారాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచ అత్యంత ధనిక కుటుంబాలలో ప్రస్తుతం అంబానీలది కూడా ఒకటి. తొలిసారి 1977లో రిలయన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. ఇక అప్పటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పకుండా ప్రతేడాది ఇన్వెస్టర్లతో ముచ్చటించడం, వారి సలహాలను, సూచనలను స్వీకరించడం, కొత్త కొత్త ఆవిష్కరణలను లాంచ్ చేయడం పరిపాటిగా వస్తోంది. రిలయన్స్ ఏజీఎం, ఇతర కంపెనీలలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లతో ముచ్చటించడం జరుగుతుంది. పెట్టుబడిదారులు అడిగే ప్రశ్నలకు, చైర్మన్ ముఖేష్ సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇలా ఇన్వెస్టర్ల సలహాలు, సూచనలు, ప్రశ్నలతో ఈ సమావేశం ఎంతో ముచ్చటగా జరుగుతూ ఉంటుంది.
గతవారంలో కూడా రిలయన్స్ తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కూడా చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్, అంబానీల గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య శ్లోకా మెహతా, చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇలా అందరూ ఇన్వెస్టర్ల సమావేశానికి హాజరయ్యారు. దక్షిణ ముంబై ఆడిటోరియమంతా కంపెనీ పెట్టుబడిదారులతో నిండిపోయింది. ఈ సమావేశంలో ఓ స్పీకర్, ముఖేష్ తండ్రి ధీరూభాయ్ అంబానీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని రివీల్ చేశారు. ధీరూభాయ్ అంబానీ తన రోజును అంబానీల ప్రిన్సెస్ ఇషా అంబానీని చూసిన తర్వాతనే ప్రారంభించేవారని చెప్పారు. పొద్దున లేవగానే ధీరూభాయ్ అంబానీ తొలుత ఇషా అంబానీ ఫోటోను చూస్తారని, ఆ అనంతరమే టీ లేదా టిఫిన్ తీసుకుని తన రోజూవారీ కార్యకలాపాలకు సిద్ధమవుతారని తెలిపారు. ప్రస్తుతం ఇషా మన కళ్ల ముందే పెరిగి, టెలికాం రంగంలో పెను సంచలనమైన జియోను ఆవిష్కరించినట్టు ఇన్వెస్టర్ల సమావేశంలో కొనియాడారు.
అంటే ధీరూభాయ్‌కి ఇషా అంటే అంత ఇష్టమనమాట. ముఖేష్ అంబానీకి కూడా ఇషా అంటే ప్రాణమని పలు సందర్భాల్లో వెల్లడైంది. పెద్ద కొడుకు ఆకాశ్ పెళ్లితో పాటు, వారి గారాల పట్టి ఇషా పెళ్లిని కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఇషా పెళ్లి ప్రకటన చేసిన అనంతరం నిర్వహించిన పార్టీల్లో ముఖేష్ తన కూతురితో కలిసి డ్యాన్స్‌లు కూడా వేశారు. ఇటీవల ఆకాశ్-శ్లోకాల ఎంగేజ్‌మెంట్లో కూడా ముఖేష్ తన కూతురి ఇషాతో వేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment