
ఇంజినీర్స్ ఇండియా వాటా విక్రయానికి భారీ స్పందన
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో (ఈఐఎల్) 10 శాతం వాటాల విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి మెరుగైన స్పందన కనిపిం చింది. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తితో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) 2.54 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. మొత్తం 3.36 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా 8.56 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.
దాఖలైన బిడ్ల విలువ దాదాపు రూ. 1,642 కోట్లుగా ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. సూచనప్రాయంగా షేరు ఒక్కింటి ధర రూ. 190.63గా ఉండగలదని (కనీస ధర రూ.189) పేర్కొంది. దీని ప్రకారం లెక్కిస్తే 3.36 కోట్ల షేర్ల విక్రయంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 640 కోట్లు లభిస్తాయి. స్టాక్ ఎక్స్చేంజీల వద్ద లభ్యమైన గణాంకాల ప్రకారం సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం 2.69 కోట్ల షేర్లు కేటాయించగా.. 5.91 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో ఈ విభాగం 2.2 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 67.38 లక్షల షేర్లు కేటాయించగా.. 3.92 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది.
2.64 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. కాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటాల విక్రయాన్ని కొనసాగిస్తుందని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం కార్యదర్శి నీరజ్ గుప్తా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ జరిగిన సంస్థల్లో ఇది ఐదోది. దీనితో కేంద్రం పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 13,340 కోట్లు సమీకరించినట్లవుతుంది. బీఎస్‌ఈలో ఈఐఎల్ షేరు శుక్రవారం 0.52 శాతం నష్టంతో రూ. 193.05 వద్ద ముగిసింది.