
కార్మికుల బ్యాంక్ వస్తోంది!
కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి...
ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదన...
♦ చందాదారులకు రుణాలు, మెరుగైన రాబడులను అందించడమే లక్ష్యం
న్యూఢిల్లీ: కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రూ.6.5 లక్షల కోట్ల భారీ మూలనిధితో తులతూగుతున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ).. ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ప్రధానంగా పీఎఫ్ చందాదారులకు మరింత మెరుగైన రాబడులను అందించడంతో పాటు వారికి సులువుగా రుణ సదుపాయాన్ని కల్పించడమే దీని లక్ష్యం. ‘ఈపీఎఫ్‌ఓ నిధులను ఉపయోగించుకొని కార్మికుల బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మేం కసరత్తు చేస్తున్నాం. పూర్తిస్థాయిలో కొలిక్కివచ్చాక దీన్ని ఆర్థిక సేవల విభాగానికి(డీఎఫ్‌ఎస్) పంపనున్నాం’ అని కార్మిక శాఖలోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్ 19న జరిగిన ఈపీఎఫ్‌ఓ కేంద్ర టస్ట్రీల బోర్డు(సీబీటీ) సమావేశంలోనే ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాగా, ఈపీఎఫ్‌ఓ సేవలను మెరుగుపరచడానికి చర్యలు ఊపందుకుంటున్న నేపథ్యంలో బ్యాంకును ఏర్పాటు చేయడానికి ఇది సరైన తరుణం కాదని మరో సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా పోర్టబుల్ పీఎఫ్ నంబర్లు ఇతరత్రా కోర్ బ్యాంకింగ్ తరహా సేవలను ఇప్పుడిప్పుడే ప్రవేశపెడుతున్నామని.. ఇటువంటి సమయంలో కొత్త వెంచర్‌ను ప్రారంభించేకంటే.. ఉన్న సేవలనే మరింత సమర్థంగా అందించడంపై దృష్టిపెడితే బాగుంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో సెంట్రల్ ఒకేషనల్ వర్సిటీ!
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓకు 5 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారులు ఉన్నారు. రూ.6.5 లక్షల కోట్ల మూలనిధి(కార్పస్) ఉంది. ప్రతి ఏటా రూ.70,000 కోట్లు డిపాజిట్ల రూపంలో జమఅవుతున్నాయి. మరోపక్క, సెంట్రల్ ఒకేషనల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోందని కూడా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీని ప్రధాన క్యాంపస్ హైదరాబాద్‌లో, ప్రాంతీయ క్యాంపస్‌లు లూధియానా, కోల్‌కతా, గుజరాత్, చెన్నైలలో నెలకొల్పాలని ప్రతిపాదిస్తున్నారు. కాగా, గురువారం జరగాల్సిన సీబీటీ సమావేశం వాయిదా పడింది. ఏప్రిల్ 1 నుంచి మూడేళ్ల కాలానికి సంస్థ నిధుల నిర్వహణ కోసం ఫండ్ మేనేజర్ల నియామకం, ఈపీఎఫ్‌ఓ పెన్షన్ పొందేందుకు చందాదారుల వయస్సును ఇప్పుడున్న 58 ఏళ్ల నుంచి 60కి పెంచడం వంటి ప్రతిపాదనలను ఈ భేటీలో చర్చించాల్సి ఉంది.