అకౌంట్ ఓపెన్ చేయడానికి ఖర్చెంతో తెలుసా?
బ్యాంకు ఖాతా తెరవడం ఏముందిలే.. బ్యాంక్‌కు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పిస్తే చాలనుకుంటున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు ఖాతా తెరవడం ఏముందిలే.. బ్యాంక్‌కు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పిస్తే చాలనుకుంటున్నారా? అసలు ఎప్పుడైనా బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఖర్చెంత అవుతుందో ఆలోచించారా? కనిపించకుండానే ఈ ప్రక్రియకు బాగానే ఖర్చు అవుతుందట. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఇది తెలిసింది. బ్యాంకు ఖాతా తెరవడానికి మూడు సార్లు మీరు బ్యాంకుకు వెళ్తే, దాదాపు 139 రూపాయల మేర ఖర్చు అవుతుందట. తొలిసారి బ్యాంకుకు వెళ్లినప్పుడు కావాల్సిన వివరాలు కనుక్కోవడం, రెండో సారి కావాల్సిన పత్రాలు సమర్పించడం, అనంతరం బ్యాంకు ఖాతా తెరిచినట్టు బ్యాంకు సిబ్బంది ఇచ్చే డాక్యుమెంట్లను స్వీకరించడం ఇలా వెళ్లిన ప్రతిసారి అయ్యే ఖర్చులు మొత్తం 139 రూపాయల మేర అవుతుందని ఆర్‌బీఐ రిపోర్టు పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియకు అయ్యే సమయం కూడా 7 గంటల 28 నిమిషాలని రిపోర్టు తెలిపింది.
బ్యాంకింగ్ స్టాఫ్‌తో డీల్ చేయడం వినియోగదారులకు మరింత సమయం పడుతుందని చెప్పింది. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ సమయంలో ఎక్కువగా సమయం వెచ్చించాల్సి వస్తుందని వెల్లడించింది. 2016లో బ్యాంకుల ఆడిట్‌లో వెల్లడైన డేటా మేరకు ముందస్తు ప్రక్రియలన్నీ అయిపోయిన తర్వాత కేవలం డాక్యుమెంటేషన్ కోసమే రెండు గంటల మేర సమయం పడుతుందట. దీని ఖర్చు కూడా 77 రూపాయలని తెలిసింది. పలు పత్రాల్లో వివరాలు నింపడానికి 20 నిమిషాల సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ట్రావెలింగ్‌కు 3 గంటల 22 నిమిషాలు.. ఇలా మొత్తంగా ఏడు గంటల 28 నిమిషాల మేర సమయాన్ని బ్యాంకు అకౌంట్ తెరవడానికే వినియోగించాల్సి వస్తుందని ఆర్‌బీఐ రిపోర్టు వెల్లడించింది. టెక్నాలజీ మార్గాలతో బేసిక్ బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించాలని భావిస్తున్నట్టు ఆర్‌బీఐ రిపోర్టు తెలిపింది. జన్‌ధన్, ఆధార్, మొబైల్ ఫోన్ ద్వారా ఖర్చులు తగ్గించడానికి సాయపడతాయని పేర్కొంది.