ఫీచర్ ఫోన్‌లోనూ 4జీ స్పీడ్
వైఫై సౌకర్యం ఉంటే చాలు
* హువాయితో కలిసి ఎయిర్‌టెల్ ప్రత్యేక గాడ్జెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 4జీ వేగంతో డేటా కావాలంటే అందుకు తగ్గ మొబైల్ హ్యాండ్‌సెట్ ఉండాల్సిందే. అలా కాకుండా ఫీచర్ ఫోన్‌లోనూ వేగవంతమైన డేటా కావాలంటే? వైఫై సౌకర్యం ఉంటే చాలు తాము అందిస్తున్న 4జీ హాట్‌స్పాట్‌తో 30 ఎంబీపీఎస్ వరకు స్పీడ్‌ను ఉపయోగించుకోవచ్చని చెబుతోంది ఎయిర్‌టెల్.
హువాయి సహకారంతో కంపెనీ రూ.2,300కు ఈ హాట్‌స్పాట్ గాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చేతిలో ఇట్టే ఇమిడిపోయే ఈ ఉపకరణం సిమ్‌తో పనిచేస్తుంది. ప్రయాణంలో ఉన్నాసరే... దీని ద్వారా ఒకేసారి 10 ఉపకరణాల్లో నెట్‌ను వినియోగించుకోవచ్చు. బ్యాటరీ 6 గంటల పాటు పనిచేస్తుంది. 4జీ హాట్‌స్పాట్ కోసం కొద్ది రోజుల్లో ప్రత్యేక డేటా ప్యాక్‌లు రానున్నాయి. ఎయిర్‌టెల్ ప్రస్తుతం 3జీ ధరకే 4జీని అందిస్తోంది.
రెండింతల వినియోగం..
భారత్‌లో టెలికం కంపెనీల ఆదాయంలో డేటా నుంచి వస్తున్నది 14-15% వరకూ ఉంది. ఏడాదిలో ఇది 20%కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయ్‌రాఘవన్ బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘సగటున ఒక్కో కస్టమర్ డేటా కోసం నెలకు రూ.70-80 వెచ్చిస్తున్నారు. ఈ వ్యయం ఏటా 100% వృద్ధి చెందుతోంది. స్మార్ట్‌ఫోన్ల జోరుకు తోడు 4జీ కూడా డేటా వినియోగం పెరి గేందుకు దోహదం చేస్తోంది.
4జీ ఫోన్ల ధరలు క్రమేపీ తగ్గుతుండటం కూడా కలసి వచ్చే పరిణామమే. ఉపకరణాల ధరలు మరింత దిగి వస్తే 3జీని మించిన అవకాశాలుంటాయి’ అని వివరించారాయన. ఏడాదిలో 10 నగరాలకు..: ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్‌లో హైదరాబాద్, వైజాగ్‌లో ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఇటీవల ప్రారంభిం చింది. జూలై నుంచి వాణిజ్యపరమైన సేవలను మొ దలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ, వరంగల్, కర్నూలు, తిరుపతి సహా 10 నగరాల్లో 2015-16లో 4జీ అడుగు పెట్టనుంది. సర్కిల్‌లో సంస్థకు 2 కోట్లకుపైగా మొబైల్ యూజర్లున్నారు.