ఫెడ్ ఆశలతో మార్కెట్ పైకి..
సెన్సెక్స్ 258 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు అప్
చైనా ఆర్థిక సంక్షోభం దరిమిలా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న ఆశలతో బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో తదితర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 258 పాయింట్లు ఎగిసి 25,964 వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరోసారి కీలకమైన 7,900 పాయింట్ల స్థాయిని అధిగమించే ప్రయత్నం చేసింది. చివరికి 70 పాయింట్ల లాభంతో 7,899 వద్ద ముగిసింది. ఆగస్టు 31 తర్వాత రెండు సూచీలు ఇంత అధిక స్థాయిలో క్లోజవడం ఇదే ప్రథమం. మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నెల 29న జరిగే పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక పాలసీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటు సానుకూలంగా ఉండేలా చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
విద్యుత్, బ్యాంకింగ్ షేర్లు వెలుగులో..
బ్యాంకింగ్, విద్యుత్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఐటీ రంగాల షేర్లు లాభపడగా.. కన్జూమర్ డ్యూరబుల్, రిఫైనరీ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు నష్టపోయాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 26 స్క్రిప్స్ లాభాల్లో ముగిశాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 26,007 పాయింట్లకు ఎగిసింది. కానీ గరిష్ట స్థాయుల్లో లాభాల స్వీకరణ జరగడంతో 25,816 స్థాయికి తగ్గింది.