
న్యూఢిల్లీ: మెసేజ్‌ల జాడ కనుక్కునే సాంకేతికతను అమలు చేయాలంటూ మెసెంజర్ సేవల సంస్థ వాట్సాప్‌నకు మూడోసారి నోటీసు ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ యోచిస్తోంది. దీనిపై అంతర్గతంగా చర్చ జరిగినట్లు, వచ్చే వారం, పది రోజుల్లో వాట్సాప్‌నకు మూడోసారి నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాట్సాప్‌లో వైరల్‌గా మారుతున్న తప్పుడు వార్తలు, మెసేజ్‌లు పలు సందర్భాల్లో హింసకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
ఇటువంటి మెసేజ్‌లకు మూలం ఎక్కడ ఉంది, ఎలా విస్తరిస్తున్నాయి అన్నది జాడ తెలుసుకునేందుకు తగు సాంకేతికతను అందుబాటులోకి తేవాలంటూ వాట్సాప్‌నకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపింది. అయితే, సందేశాల ఎన్‌క్రిప్షన్‌కు, యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందనే కారణాలతో వాట్సాప్ ఇందుకు అంగీకరించడం లేదు. అయితే, మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడంపై పరిమితులను మాత్రం ప్రవేశపెట్టింది. దీంతో తమకు వచ్చిన కంటెంట్‌ను ఇతరులు ఫార్వర్డ్ చేసిన పక్షంలో .. సదరు మెసేజ్‌పై ఫార్వర్డ్ అనే లేబుల్ కనిపిస్తుంది.