
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు.. నవంబర్‌లోనే పరిమితిని దాటేసింది. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న దాన్ని మించి 112% స్థాయిని తాకింది. జీఎస్‌టీ వసూళ్లు తక్కువగా ఉండటం, వ్యయాలు అధికంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం.
వ్యయాలు, ఆదాయానికి మధ్య వ్యత్యాసమైన ద్రవ్య లోటు 2017–18 ఏప్రిల్–నవంబర్ మధ్యకాలంలో రూ. 6.12 లక్షల కోట్లుగా ఉన్నట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాల్లో వెల్లడైంది. 2016–17 ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ద్రవ్య లోటు నిర్దేశిత పరిమితిలో 85.8 శాతం మాత్రమే నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటును జీడీపీలో 3.5%కి పరిమితం చేయగలిగిన కేంద్రం ఈసారి 3.2%కి కుదించాలని నిర్దేశించుకుంది.