స్టార్టప్స్‌ వేల్యుయేషన్స్‌పై కేంద్రం దృష్టి | Focus on Startups valuations | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌ వేల్యుయేషన్స్‌పై కేంద్రం దృష్టి

Published Sat, Nov 24 2018 1:31 AM | Last Updated on Sat, Nov 24 2018 1:31 AM

Focus on Startups valuations - Sakshi

న్యూఢిల్లీ: కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన స్టార్టప్‌ సంస్థలు భారీ వేల్యుయేషన్స్‌ దక్కించుకుంటూ ఉండటంపై కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ ప్రీమియంతో షేర్లు తీసుకోవడం వెనుక అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తొలి విడత నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్‌ గణనీయంగా పడిపోయిన కంపెనీలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2013 నుంచి నిధులు సమీకరించిన 2,000 పైచిలుకు స్టార్టప్స్‌కు గత 45 రోజుల్లో నోటీసులు పంపినట్లు సమాచారం. అసలు ఏ ప్రాతిపదికన ఇంత వేల్యుయేషన్‌ లెక్కగట్టి నిధులు సమీకరించారో వివరణనివ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకం కింద మినహాయింపులేమైనా పొందాయా అన్న విషయాన్ని కూడా తెలపాలని నోటీసుల్లో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘మీ స్టార్టప్‌ సంస్థ అధిక ప్రీమియంతో షేర్లను కేటాయించడం జరిగింది. దీన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు. అలాగే, స్టార్టప్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మినహాయింపులు పొందారో తెలపాలి‘ అంటూ స్టార్టప్‌లకు ఎంసీఏ నోటీసులు పంపింది. అయితే, వీటిల్లో ట్యాక్సేషన్‌ గురించి లేదా పెనాల్టీల గురించిన ప్రస్తావన ఏమీ లేదు.  

వేల్యుయేషన్‌ను ప్రభావితం చేసే అంశాలు అనేకం.. 
మరోవైపు, స్టార్టప్స్‌ వేల్యుయేషన్స్‌ అనేవి భవిష్యత్‌ లాభదాయకత మొదలైన అనేక అంశాల ఆధారంగా ఉంటాయని పన్నుల నిపుణులు తెలిపారు. వేల్యుయేషన్‌ లెక్కింపునకు పాటించే విధానాలు సందర్భానుసారంగా వివాదాస్పదంగానూ కనిపించవచ్చని పేర్కొన్నారు. ఇక అధిక ప్రీమియంతో నిధులు సమీకరించినా.. వ్యాపార పరిస్థితులు, తీవ్ర పోటీ, అధిక వృద్ధి సాధనలో మేనేజ్‌మెంట్‌ విఫలం కావడం వంటి అంశాల కారణంగా వేల్యుయేషన్‌ పడిపోయే అవకాశాలు ఉన్నాయని ట్యాక్స్‌ నిపుణులు తెలిపారు. ఆదాయ పన్ను శాఖ కూడా 2016లో స్టార్టప్స్‌ నుంచి ఇలాంటి వివరణే అడిగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తొలి రౌండు నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్‌ పడిపోయిన పక్షంలో స్టార్టప్‌లు 33 శాతం పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ డిమాండ్‌ చేస్తోంది. అయితే, ఏంజెల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులను మాత్రమే ఆదాయ పన్ను శాఖ ప్రశ్నించగా.. ఎంసీఏ మాత్రం వెంచర్‌ క్యాపిటల్, పీఈ లావాదేవీల సహా అన్ని రకాల పెట్టుబడులను నోటీసుల పరిధిలోకి చేర్చింది. ఆదాయ పన్ను శాఖ నోటీసులపై స్టార్టప్‌లు ఇంకా న్యాయపోరాటం కొనసాగిస్తుండగానే.. తాజాగా ఎంసీఏ నోటీసులు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement