జియోనీ ఎస్5.5 హల్‌చల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో అతి సన్నని(స్లిమ్) స్మార్ట్‌ఫోన్ జియోనీ ఈలైఫ్ ఎస్5.5 భారత మార్కెట్లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అతితక్కువ మందం 5.5 మిల్లీమీటర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇదొక్కటే. దీంతో ఎప్పుడు చేతుల్లోకి వస్తుందా అని కస్టమర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కంపెనీ తొలి లాట్‌లో 30 వేల పీసులను భారత్‌కు తెప్పించింది. వారం రోజుల్లో ఇవి రిటైల్ షాపుల్లోకి చేరనున్నాయి. బుకింగ్స్ ఇంత కంటే అధికంగా ఉండడంతో అదనంగా 30 వేల పీసులను కంపెనీ తెప్పిస్తోంది.
రెండు నెలల్లో 70 వేల పీసులకుపైగా అమ్ముడవుతాయని జియోనీ అంచనా. ఈలైఫ్ ఎస్5.5 ధర రూ.22,999 ఉంది. 5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే, 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ దీని విశిష్టతలు.
రాష్ట్రంలో 1,000 పీసులకు పైగా బుకింగ్స్...
భారతీయ కస్టమర్లు అనుభూతి కోరుకుంటున్నారని అనడానికి ఎస్5.5కు ఉన్న డిమాండ్‌ను చూస్తే అర్థమవుతోందని జియోనీ ఇండియా హెడ్ అరవింద్ ఆర్ వోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 1,000 పీసులకుపైగా బుకింగ్స్ నమోదైనట్టు సమాచారం.