జీఎంఆర్ ఇన్ఫ్రా...నష్టాలు రూ. 123 కోట్లు | GMR Infra Q1 net loss zooms to Rs 123 crore | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ ఇన్ఫ్రా...నష్టాలు రూ. 123 కోట్లు

Published Fri, Sep 16 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

జీఎంఆర్ ఇన్ఫ్రా...నష్టాలు రూ. 123 కోట్లు

జీఎంఆర్ ఇన్ఫ్రా...నష్టాలు రూ. 123 కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టం ప్రకటించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 123 కోట్ల నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో నష్టం రూ. 1.33 కోట్లే. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 269 కోట్ల నుంచి రూ. 361 కోట్లకు పెరిగినప్పటికీ.. వ్యయాలు సైతం రూ. 37 కోట్ల నుంచి రూ. 81 కోట్లకు ఎగిశాయి. దేశ, విదేశాల్లో విమానాశ్రయాలు, రవాణా, విద్యుత్ తదితర రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.

గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి గ్రూప్ రుణ భారం దాదాపు రూ. 45,000 కోట్ల మేర ఉంది. రుణభారం తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ గత కొన్నాళ్లుగా వివిధ ప్రాజెక్టుల్లో వాటాలు విక్రయిస్తోంది. తాజాగా జీఎంఆర్ కన్సార్షియంకు చెందిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (జీహెచ్‌ఐఏఎల్) వాటాల కొనుగోలుకు అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థ రేసులో ఉన్నట్లు సమాచారం. దాదాపు 30 శాతం వాటాల కొనుగోలు కోసం అపోలో గ్లోబల్ సుమారు రూ. 2,000 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఐడీఎఫ్‌సీ ఆల్టర్నేటివ్స్ మొదలైన సంస్థలు కూడా ఇందుకు పోటీపడ్డాయి. అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ దాదాపు రూ. 1,400 కోట్లకు బిడ్ చేసింది. అయితే  ప్రాజెక్టుకు దాదాపు రూ. 6,800 కోట్ల విలువ కడుతూ మిగతా సంస్థల కన్నా అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన అపోలో గ్లోబల్‌ను జీఎంఆర్ షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జీఎంఆర్‌కు 63 శాతం, మలేసియా ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ బెర్హాద్‌కు 11 శాతం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. తెలంగాణ ప్రభుత్వానికి 26 శాతం వాటాలు ఉన్నాయి.

 మరోవైపు జీఎంఆర్ గ్రూప్ ఇటీవలే గోవాలో కొత్తగా మరో విమానాశ్రయం ప్రాజెక్టు దక్కించుకుంది. దీని విలువ సుమారు రూ. 3,100 కోట్లు. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా దాదాపు రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. గురువారం బీఎస్‌ఈలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేరు దాదాపు 2 శాతం నష్టపోయి రూ. 14.30 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement